పాత కక్షలు...కొత్త కుట్రలు!
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో కాంగ్రెస్ పార్టీలో సహజ రాజకీయాలు మొదలయ్యా యి. కడుపులో కత్తులు దాచుకుని కౌగిలించుకుంటున్నారు. వెన్నుపోట్లకు తెరతీశారు. పాత కక్షలను రాజేసుకుంటూ కొత్త కుట్రలకు పథకాలు రచిస్తున్నారు. అంతర్గతంగా జరుగుతున్న కుటీల యత్నాలతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్న పలువురికి గట్టిజెల్లే తగలనుంది. గతంలో తమను ఓడించిన వారికి ఇప్పుడా రుచి చూపించాలని రెండు వర్గాల వారూ పరస్పరం కత్తులు నూరుతున్నారు. ఆబోతుల కుమ్ములాటలో లేగదూడలు నలిగిపోయినట్టు ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న పోరులో పలువురు బలి పశువులు కాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కేంద్రంలో కోలగట్ల వీరభద్రస్వామిని నమ్ముకున్న వారంతా బీఎస్సీ తరఫున పోటీ చేయగా, బొత్స సత్యనారాయణపై ఆధారపడిన వారంతా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇరువర్గాల వారు ఒకరినొకర్ని దెబ్బతీసుకున్నారు. గెలిచిన అనంతరం పొత్తు పెట్టుకుని ఒక్కటయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుని, ఇరు పక్షాలూ దోబూచులాట ఆడాయి. ఆధిపత్యం కోసం ప్రయత్నించాయి. ఈ క్రమంలో కోలగట్ల వీరభద్రస్వామి కాంగ్రెస్‌పంచన చేరారు. నేతలంతా ఒక్కటైనట్టు ఫొటోలకు ఫోజిచ్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేశారు.
అంతవరకు బాగానే ఉన్నా పోలింగ్ సమయం కొచ్చేసరికి లోపాయికారీగా ఆయన వ్యతిరేకవర్గం వారు కుట్రలు చేశారు. దీంతో ఆయన ఓటమి పాలయ్యారు. వాస్తవానికి బొత్స నీడలో ఉండగా కోలగట్ల వీరభద్రస్వామి గెలవరలేన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఆ క్రమంలో జరిగిన ప్రతి (1994, 1999) ఎన్నికల్లోనూ కోలగట్ల ఓటమి చవిచూశారు. ఎందుకలా జరిగిందో ఆయన చెప్పకపోయినా ఉన్న సత్యమేంటో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బొత్సకు దూరమై 2004లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కోట్లగట్ల విజయం సాధించారు. కానీ 2009లో మళ్లీ ఒక్కటయ్యారు. మనస్ఫూర్తిగా పని చేయాలని బాసలు చేసుకున్నారు. పోలింగ్ సమయం వచ్చేసరికి పాత పరిణామాలే పునరావృతమయ్యాయి. ఫలితాలపై ప్రభావం చూపాయి. ఇవన్నీ ఆ నేతలకు తెలిసిందే. కానీ చేసేదేమి లేక, తప్పని పరిస్థితుల్లో కలిసి పని చేస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఎవరైతే దెబ్బకొట్టారో వారినొక చూపు చూడాలని ఇప్పుడా నాయకులు ఆలోచనకొచ్చినట్టు తెలిసింది.
స్వతంత్రుల మాటున కుతంత్రాలు
పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులగా ఒకవైపు ప్రకటిస్తూనే... మరోవైపు ఇండిపెండెంట్‌లుగా అదే స్థానాల్లో మరికొంతమందిని బరిలో నిలబెడు తున్నారు. ఓ చేత్తో పార్టీ పరంగా చేయూత ఇస్తున్నట్టు నటిస్తూ.. మరో చేత్తో లోపాయికారీగా స్వతంత్రులకు ఆశీస్సులు అందిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఇండిపెండెంట్లుగా పలువుర్ని బరిలోకి దించుతున్నారు. బయటికి మాత్రం మనస్ఫ్పూర్తిగా పని చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ డ్రామాలో ఎవరు బలి అవుతారో మరికొన్ని రోజుల్లో స్పష్టంగా తేలనుంది. నమ్ముకున్నవారికి కాంగ్రెస్ రాజకీయం అప్పుడు బోధపడ నుంది.