‘రాజీ’కీయం | congress support to tdp in municipal elections | Sakshi
Sakshi News home page

‘రాజీ’కీయం

Published Thu, Mar 13 2014 3:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress support to tdp in municipal elections

 సాక్షి, ఒంగోలు: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఎటూ గెలవదని తేల్చుకున్న నేతలు సరికొత్త ప్రచారానికి తెరదీశారు. ‘ఓటేస్తే మాకు.. లేకుంటే టీడీపీకి’ అంటూ ఓటర్లకు బహిరంగంగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే మూడ్రోజులుగా టీడీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వెనుక కాంగ్రెస్ శ్రేణుల హడావుడి కనిపించడం గమనార్హం. స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమ అనుచరవర్గాన్ని టీడీపీ నేతల వద్దకు పంపు తుండడాన్ని చూసి జనం ఆశ్చర్య పోతున్నారు.

 టీడీపీకి స్నేహ హస్తమిచ్చి..
 జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలుండగా, వాటిల్లో కోర్టు వివాదాల కారణంగా ఒంగోలు, కందుకూరు ఎన్నికలు వాయిదాపడ్డాయి. చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలతో పాటు కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు, అద్దంకి నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగను న్నాయి. మున్సిపాలిటీల్లో ఉనికి కోసం పోరాటం చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లోనూ కుమ్మక్కు వైఖరిని అవలంబిస్తున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంలో సూత్రధారిగా వ్యవహరించిన చంద్రబాబు... రాష్ట్రాన్ని అడ్డగోలుగా

 ‘రాజీ’కీయం
 
 చీల్చిన కాంగ్రెస్ అధిష్టానం దెబ్బకు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలశ్రేణులు తీవ్రంగా కలత చెందారు. ఆ పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు వస్తున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు టీడీపీ, కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి నామినేషన్ల కార్యక్రమంలో డామినేషన్‌ల వరకు ఒకరికొకరు సాయపడటంపై ద్వితీయశ్రేణి వర్గం విస్మయం చెందుతోంది. నిన్నటిదాకా కత్తులు దూసుకున్న నేతలు .. నేడు ఒకటై భుజాల మీద చేతులేసుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇటువంటి వ్యవహారాలు చీరాల, కనిగిరి, అద్దంకి మున్సిపాలిటీల్లో కనిపిస్తున్నాయి.

 పలువురు కాంగ్రెస్ నేతలు వార్డుల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించాలని.. తమపై నమ్మకం లేకుంటే వైఎస్సార్ సీపీ మినహా ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చని ఉచిత సలహాలిస్తున్నట్లు వినిపిస్తోంది. కనిగిరి, అద్దంకిలో ఒకరిద్దరు నేతలు ఆ తరహా ప్రచారం చేస్తుండగా, స్వపక్ష నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ బద్ధవైరం నెరపిన పార్టీతో తామెలా కలిసి పనిచేస్తామంటూ నిలదీశారు. మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీలను టీడీపీ వైపు మలుచుకునేందుకు నేతలు కసరత్తు చేయగా, వారంతా ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తుండటంతో.. కనీసం కాంగ్రెస్, టీడీపీ నేతలతో భేటికీ సైతం సిద్ధపడటం లేదు. అంతే గాకుండా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదంటూ ఖరాకండిగా చెబుతున్నారు.

 అభ్యర్థుల అలకతో బహిర్గతమవుతున్న
 ‘కుమ్మక్కు’: ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయడంలో కుమ్మక్కు వ్యవహారంపై ఆరెండు పార్టీల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. రెండ్రోజుల కిందట జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ నిర్వహించిన నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పలువురు ఆగ్రహించారు. ప్రతీసారి సీట్ల కేటాయింపులో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. ప్రస్తుత మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా న్యాయం చేయాలని ఆక్రోశం వెళ్లగక్కారు. అయితే, నిన్నటిదాకా కాంగ్రెస్‌లో తిరిగి.. తమపై అక్రమ కేసులు బనాయించిన వారిని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటిస్తే సహించమని నేరుగా హెచ్చరించారు.  

కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లలో మాట్లాడి మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని.. కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినాయకుల కుమ్మక్కు రాజకీయం తమ నెత్తిమీదికొస్తోందని.. గెలుపుపై నమ్మకం లేకుండానే ఇరుపార్టీల అభ్యర్థులు అలుపెరగకుండా పనిచేయాల్సి వస్తోందని నేతలు అనుచరుల వద్ద వాపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement