‘మిని’ పోల్స్
Published Sun, Mar 2 2014 1:45 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
అరండల్‌పేట,(గుంటూరు) న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఖరారు చేయడంతో రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఉత్సాహం చూపుతున్నారు. వార్డుల వారీ పోటీకి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆదేశించాయి. ఇదిలావుంటే గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. డివిజన్ల పునర్విభజన అంశం కొలిక్కి రానందున ఇక్కడ ఎన్నికలు సాధ్యపడటం లేదు.
గడచిన మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబరు 30 నాటికి ముగిసింది.
మూడున్నరేళ్లుగా ప్రభుత్వం రకరకాల కారణాలతో ఎప్పటికప్పుడు ఎన్నికల్ని వాయిదా వేస్తూ వచ్చింది.
రాష్ట్రంలోని తాజా పరిస్థితుల్ని గుర్తించిన హైకోర్టు నాలుగువారాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలంటూ గత నెల 3న ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి చుక్కెదురైంది.
చివరకు మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను శనివారం రాష్ట్ర ప్రభుత్వం
ఖరారు చేసింది.
మరోవైపు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలకు ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్లును ఖరారు చేసింది.
నేడు వార్డుల వారీగా ఓటర్ల జాబితా వెల్లడి
జిల్లాలోని 12 పురపాలక సంఘాల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల
జాబితాను అధికారులు ఆదివారం వెల్లడించనున్నారు.
జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 634 పోలింగ్
బూత్‌లు ఉన్నాయి.
ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా అందుబాటులో
ఉంటుందని పురపాలకశాఖ అధికారులు వెల్లడించారు.
పురపాలక సంఘాల్లోని 362 వార్డులకూ రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
మున్సిపాల్టీల్లో నివసించే 6,08,972 మంది ఓటర్లు తమ ఓటు
హక్కు వినియోగించుకోనున్నారు.
Advertisement
Advertisement