బెట్ అంటే బెట్ !
Published Tue, Apr 1 2014 2:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :‘కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం’ అంటూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల్లో పందేలు కాస్తున్నారు. ఆదివారం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యాన్ని ప్రదర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.భారీగా పోలింగ్ నమోదుకావడంతో బెట్టింగ్ రాయుళ్లు పందేలకు తెరతీశారు.
ఆదివారం సాయంత్రం నుంచే అన్ని పార్టీల ముఖ్యనాయకులు, వార్డు కార్యకర్తలతో మాట్లాడుతూ ఏ పార్టీకి ఏ మున్సిపాల్టీ అనుకూలంగా ఉంది. ఏ వార్డులో ఏ అభ్యర్థి గెలుస్తాడు అని అంచనాలు వేసుకుంటూ జిల్లాస్థాయిలో 12 మున్సిపాల్టీలకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.ఫోన్లు చేసి మరీ ఫలానా మున్సిపాల్టీకి ఫలానా పార్టీ తరఫున పందెం ఉందని, ఫలానా వార్డులో అభ్యర్థి గెలుస్తాడని ఒకటికి రెండు రెట్లు పందెం ఉంది కాస్తావా అంటూ బెట్టింగ్ బంగార్రాజులు ఆశలు రేపుతున్నారు.
ముఖ్యంగా జిల్లాలో మంగళగిరి, చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, తెనాలి మున్సి పాల్టీలపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.బడా వ్యాపారుల నుంచి రైతు కూలీల వరకు ఎవరి స్థాయిలో వారు పందేలకు సై అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల లెక్కింపుపై మంగళవారం హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో లెక్కింపు రెండో తేదీనే జరుగుతుందని కొందరు, లేదు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికల అనంతరం లెక్కింపు ఉండేలా కోర్టు తీర్పునిస్తున్నట్లు మరికొందరు అంచనా వేస్తూ పందేలకు దిగుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయి అనే పందేలతో పాటు ,ఎవరికి స్పష్టమైన మెజార్టీలు రావని, హంగ్ ఏర్పడుతుందని బెట్టింగ్‌లు సాగుతున్నాయి.= క్రికెట్ బెట్టింగ్‌లో మ్యాచ్ మొత్తం ఎవరు , ఈ ఓవర్‌లో ఎన్ని పరుగులు చేస్తారు, ఈ బంతికి ఎన్ని పరుగులు కొడతారనే పందేలు ఎలాగైతే నడుస్తాయో ఇక్కడ కూడా ఏ వార్డు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, మూడోస్థానంలో ఏ పార్టీ నిలుస్తుందనే దానిపై జోరుగా పందేలు కాస్తున్నారు.= కొన్ని చోట్ల వార్డు అభ్యర్థుల కోసం పనిచేసిన పార్టీ నాయకులు బెట్టింగ్ రాయుళ్లకు ఫోన్ చేసి మా వార్డులో మా పార్టీ అభ్యర్థి తప్పక గెలుస్తారు, ఎంత పందెమైనా కాస్కోండి అంటూ సలహా ఇస్తూ తనకూ ఎంతో కొంత కమీషన్ ఇవ్వండి అంటూ బేరాలు కుదుర్చుకుంటున్నారు.
హైకోర్టు తీర్పుపై అభ్యర్థుల్లో ఆందోళన
= నెల రోజులుగా తిండీతిప్పలు మానుకొని ఎన్నికల్లో విజయం కోసం ఓటర్ల చుట్టూ తిరిగిన అన్ని పార్టీల అభ్యర్థులు ఓట్ల లెక్కింపుపై మంగళవారం హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందోనని ఆందోళన చెందతున్నారు.
= గెలుపుపై నమ్మకం లేని కొందరు అభ్యర్థులు లెక్కింపు సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నారు.
= కచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉన్న అభ్యర్థులు మాత్రం ఏప్రిల్ రెండో తేదీన ఫలితాలు వెలువడితే ఆనందంగా ఉండవచ్చని భావనలో ఉన్నారు.
= టీడీపీ నియోజకవర్గస్థాయి నాయకులు మాత్రం లెక్కింపు ప్రక్రియ వాయిదా పడితే తమకు హాయిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement