టీడీపీ నేతల హల్‌చల్
టీడీపీ నేతల హల్‌చల్
Published Mon, Mar 31 2014 2:05 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రజల్లో పట్టు ఉందని నిరూపించుకోవాలనే ప్రయత్నంలో టీడీపీ నాయకులు అడ్డదారిలో గెలుపొందాలనే కుట్రలకు తెర తీశారు. పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి మంచి పట్టు ఉందంటూ ఇప్పటి వరకు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులు ఆదివారం ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందాలని అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. మాచర్ల మున్సిపాలిటి పరిధిలోని 29 వార్డులో ఓటు వేసేందుకు వె ళ్లిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చూసి ఆగ్రహానికి గురై ఈవీఎంలను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలింగ్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో గంటకుపైగా పోలింగ్ నిలిచిపోయింది.
అధికారులు వేరే ఈవీఎంను తీసుకొచ్చి పోలింగ్ నిర్వహించారు. లక్ష్మారెడ్డి సృష్టించిన అలజడికి అక్కడే ఉన్న ఐజీ సునిల్‌కుమార్ వెంటనే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. నరసరావుపేటలో టీడీపీ నాయకులు అడుగడుగున అల్లర్లకు పాల్పడ్డారు. 11 వార్డులో 320 ఓట్లు వైఎస్సార్‌సీపీకి చెందినవి వేయడానికి వీల్లేదంటూ గొడవకు దిగారు. తొమ్మిదో వార్డులో యలమంద నుంచి వచ్చిన టీడీపీ నాయకులు గొడవకు దిగి హల్‌చల్ చేశారు. 8, 12 వార్డుల్లో సైతం క్యూలో ఉన్న ఓటర్లకు రూ.500 చొప్పున డబ్బులు పంచుతూ టీడీపీ నాయకులు తిరుగుతుండంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వినుకొండ మున్సిపాలిటిలోని 15 వార్డులో టీడీపీ నాయకులు అలజడి సృష్టించడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్ సీపీ నాయకులపై లాఠీ చార్జికి దిగారు. పక్కనే ఉన్న హోటల్‌లో టిఫిన్ చేస్తున్న 15 ఏళ్ల పవన్‌కుమార్ అనే బాలుడినిసైతం లాఠీలతో చితక బాదడంతో కాలు విరిగింది. 26 వార్డులో ఓ వృద్ధుడి ఓటు విషయంలో టీడీపీ నాయకులు హల్‌చల్ చేశారు. సత్తెనపల్లి మున్సిపాలిటిలోని 13 వార్డులో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే వార్డులో పోలింగ్ బూత్ వద్ద గొడవకు దిగిన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు అబ్బూరి శివనాగమల్లేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు చెంచిరెడ్డిలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 25వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకుడు కొండలును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఏడో వార్డు టీడీపీ అభ్యర్థి ఆతుకూరి నాగేశ్వరరావు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి హల్‌చల్ చేశారు.
రూరల్ ఎస్పీకి పీఆర్కే ఫిర్యాదు ..
ఏటీ అగ్రహారం (గుంటూరు): పోలింగ్ అధికారులపై దాడికి పాల్పడి ఈవీఎంను ధ్వంసం చేసేందుకు యత్నించిన మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం రూరల్ ఎస్పీ జె. సత్యనారాయణకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీస్ ఆంక్షలను లెక్క చేయకుండా పోలింగ్ బూతు వద్ద ఓటర్లను సైతం భయభ్రాంతులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement