
పార్కులో పాగా
పట్టణంలో భూ ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు ‘తెలుగుతమ్ముళే’్ల భూ కబ్జాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
►పార్కు స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మాణం
►కలెక్టర్ బంగళాకుసమీపంలోనే ఆక్రమణ
►చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
►తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ మంత్రి !
► అక్రమ నిర్మాణం వద్ద ఇద్దరు యువకుల హడావుడి
మచిలీపట్నం : పట్టణంలో భూ ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు ‘తెలుగుతమ్ముళే’్ల భూ కబ్జాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ వ్యక్తి మున్సిపల్ పార్కు స్థలాన్ని ఆక్రమించి ఏకంగా అపార్ట్‌మెంట్ నిర్మిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. కలెక్టర్ బంగళాకు కూతవేటు దూరంలోనే ఈ వ్యవ హారం నడుస్తున్నా అధికారులెవరికీ కనిపించకపోవడం విశేషం. భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత మున్సిపల్ కమిషనర్ వచ్చి పరిశీలించి పనులు నిలిపివేయాలని ఆదేశించినా, ఆ తర్వాత అధికారులు నోరు మెదపకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
తొలుత రేకుల షెడ్డు...
కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలోనే గృహనిర్మాణ శాఖ నిర్మితి కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఎదురుగా వంద గజాల దూరంలో లక్ష్మణరావుపురంలో మున్సిపల్ పార్కుకు చెందిన 9.20 సెంట్ల భూమి ఉంది. ఈ స్థలంపై కన్నేసిన ఓ పెద్దమనిషి ఇటీవల అక్కడ రేకులషెడ్డు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేకులషెడ్డును తొలగించి స్థలం చుట్టూ భారీ ప్రహరీ నిర్మించారు. గత 20 రోజులుగా ఈ భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తున్నారు. లక్ష్మణరావుపురంలో గజం భూమి రూ.10 వేల నుంచి రూ.15వేల ధర పలుకుతోంది. ఈ భూమి విలువ రూ.50 లక్షల పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
కమిషనర్ ఆదేశాలు బేఖాతర్
పార్కు స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న విషయంపై స్థానికులు ఇటీవల మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఈ నెల 8వ తేదీన టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి వెళ్లి మ్యాప్‌లను పరిశీలించారు. అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న ప్రాంతం మున్సిపల్ పార్కు కోసం కేటాయించినదని నిర్ధారించారు. వెంటనే ఈ కట్టడాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఆ తర్వాత అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులు మరింత వేగవతం చేయడం విశేషం. ఈ భవనం తొలగించకుండా ఓ మంత్రి తెరవెనుక కథ నడుపుతున్నట్లు సమాచారం.
ఒక పేపరులో వేస్తే అపార్ట్‌మెంట్ కూల్చేస్తారా.. !
మున్సిపల్ పార్కులో అక్రమంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ ఫొటో తీసేందుకు ఆదివారం ‘సాక్షి’ బృందం వెళ్లగా ఓ మహిళ ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. లోపల మాత్రం తాపీమేస్త్రి పనిచేస్తున్నారు. అనంతరం ఇద్దరు యువ కులు వచ్చి ‘ఎందుకు వచ్చారు.. ఎవరు పంపారు..’ అంటూ పలు ప్రశ్నలు వేశారు. అనంతరం ‘ఇదొక్కటే పార్కు స్థలం కాదు.. దీని పక్కన ఉన్న గృహాలు కూడా పార్కు స్థలంలోనే నిర్మించారు.. ముందుగా వాటిని కూల్చివేయండి..’ అంటూ దురుసుగా మాట్లాడారు. ‘అయినా ఒక్క పేపరులో వార్త వస్తే నిర్మాణాన్ని తొలగిస్తారా..’ అంటూ వారిలో ఓ యువకుడు దూకుడుగా ప్రవర్తించాడు.
ఎందుకు తొలగించడం లేదో అర్థంకావడంలేదు : కాశీవిశ్వనాథం
లక్ష్మణరావుపురంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న విషయాన్ని మున్సిపల్ అధికారులతో పాటు స్థానికంగా నివసించే మంత్రికి తెలియజేశానని మున్సిపల్ వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం ‘సాక్షి’కి తెలిపారు. అధికారులకు చెప్పినా ఏ కారణం వల్ల ఈ కట్టడాన్ని తొలగించలేదో తనకు అర్థం కావటం లేదని ఆయన పేర్కొన్నారు.