నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఆస్తి కోసం ఆమెను అయిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, ఇన్‌చార్జి సీఐ దైవప్రసాద్ తెలిపిన మేరకు.. శిరివెళ్ల మండలం మహదేవుపురం గ్రామానికి చెందిన హుసేన్‌సా, నూర్జహాన్‌ఖాతున్(52) దంపతులు దాదాపు 30 ఏళ్ల క్రితం నంద్యాలకు కట్టుబట్టలతో వలస వచ్చారు. అయ్యలూరు మెట్ట సెంటర్‌లో హోటల్ ఏర్పాటు చేసుకొని బాగా కూడబెట్టారు.
సంతానం లేకపోవడంతో భర్తకు మరో మహిళ బీబీతో పునర్వివాహం చేసింది. అయితే ఏడాదికే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె పుట్టింటికి చేరుకుంది. ఆ తర్వాత హుసేన్ అనే బాలుడిని నూర్జహాన్‌ఖాతున్ దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. తల్లి ప్రేమను పంచడంతో పాటు ఓ ఇంటి వాడిని చేసింది. కొడుకు పుట్టిన తర్వాత హుసేన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కోడలు పర్వీన్‌కు పునర్వివాహం చేసి కొడుకును తనే పెంచుకుంటూ ఆదర్శంగా నిలిచింది.
దాదాపు ఏడాది క్రితం అనారోగ్యంతో భర్త హుసేన్‌సా మృతి చెందాడు. వయసు మీద పడుతుండటంతో ఓ తోడు ఉంటే మేలనుకున్న ఆమె.. దత్తపుత్రుడి సమీప బంధువు, భార్యను కోల్పోయిన షేక్ హుసేన్‌ఖాన్‌ను 8 నెలల క్రితం వివాహమాడింది.
ఆస్తి కోసమే అంతమొందించారా?
నూర్జహాన్, మొదటి భర్త హుసేన్‌సాల పేరిట అయ్యలూరు మెట్టలో రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెండు ఇళ్లు, గంగవరంలో ఆరు ఎకరాల పొలం ఉంది. వీటి విలువ దాదాపు రూ.3కోట్లపై మాటే. హుసేన్‌సా మృతి చెందాక ఆస్తి నూర్జహాన్‌ఖాతున్‌కు దక్కింది. అయితే హుసేన్‌సా బంధువులు తమకు ఆస్తిలో వాటా ఇవ్వాలని పట్టుబట్టారు.
చివరకు విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. సివిల్ కేసు కావడంతో పోలీసులు సర్దిచెప్పారు. అప్పటి నుంచి వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతకులు ఆమె గొంతు కోసి పరారయ్యారు. పొలం పనులు పూర్తి చేసుకుని రాత్రికి ఇల్లు చేరుకున్న హుసేన్‌ఖాన్ జరిగిన ఘోరాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు.
అతని ఫిర్యాదు మేరకు డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, ఇన్‌చార్జి సీఐ దైవప్రసాద్, ఎస్‌ఐలు రాముడు, వెంకటసుబ్బయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆస్తి కోసమే నూర్జహాన్ మొదటి భర్త బంధువులు చంపి ఉంటారని హుసేన్‌ఖాన్ అనుమానిస్తున్నాడు.
ఆస్తి కోసమేనా...
Published Wed, Jan 22 2014 2:48 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
Advertisement
Advertisement