కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రహదారి భద్రతా నియమాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వాహనాలు ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జనసమ్మర్థ ప్రదేశాలలో తోపుడుబండ్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయని, వారికి సరైన పార్కింగ్ ప్రదేశాలను ఈనెలాఖరులోగా గుర్తించాలన్నారు. రహదారులపై జీబ్రా క్రాసింగ్, బస్ బే, ఆటో బే, రోడ్డు స్టాప్ తదితర పెయింటింగ్‌లు చేపట్టాలన్నారు. నడిరోడ్డుపై ఆటోలు నిలిపి ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా ఆటోస్టాండు కోసం స్థలాలు గుర్తించాలన్నారు.
విద్యా సంస్థలున్నచోట స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు, సీసీ కెమెరా, స్మోక్ అలారం, స్పీడ్ గవర్నర్, పోలీసు, అగ్నిమాపక, రవాణా తదితర అధికారుల ఫోన్ నెంబర్లు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్క నిబంధన పాటించకున్నా 48 గంటల్లో తప్పనిసరిగా వాటిని సమకూర్చుకోవాలని, లేని పక్షంలో బస్సులను ఆపాలని రవాణాశాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీటీసీ కృష్ణవేణి, ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, డీఈఓ అంజయ్య, ఆస్పత్రుల సేవా జిల్లా కో ఆర్డినేటర్ సుబ్బారావు, ఎంవీఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
భద్రత నియమాలు పాటించాలి
Published Thu, Dec 12 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement