ఊపందుకోని ఉపాధి పనులు | Employment off tasks | Sakshi
Sakshi News home page

ఊపందుకోని ఉపాధి పనులు

Published Sat, May 24 2014 1:53 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Employment off tasks

సాక్షి, కడప : జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల వేగం మందగించింది. ఎన్నికల విధుల్లో అధికారులు బిజీగా గడపడంతో పనులకు సంబంధించి పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల పనులు వెనుకంజలో ఉండటం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో అధికారులు, కూలీలు ఇంకా గాడిన పడలేదు. గత ఏడాది ఇదే సమయంలో రోజుకు కూలీల సంఖ్య సగటున 1.35 లక్షల నుంచి 1.40 లక్షల వరకు ఉండేది. అయితే ప్రస్తుతం రోజువారి కూలీల సంఖ్య 1.15 లక్షలు మాత్రమే ఉండడం గమనార్హం. కూలీలకు కల్పించే వసతులు అంతంత మాత్రంగానే ఉండటం, పర్యవేక్షణ కొరవడటమే పనులు నత్తనడకన సాగడానికి కారణం.  జిల్లాలో అన్ని రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు.
 
 నత్తనడకన పండ్ల మొక్కల పెంపకం
 జిల్లాలో ఎన్నికల కోడ్ రాకముందే 5800 ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకానికి అంచనాలు రూపొందించారు. ఇందులో 3800 ఎకరాలకు కలెక్టర్ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఇందులో మామిడి 3 వేల ఎకరాలు, చీనీ 2 వేల ఎకరాలు, నిమ్మ 800 ఎకరాలలో  మొక్కల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు కేవలం 500 ఎకరాల్లోపు మాత్రమే గుంతలు తవ్వడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 1500 ఎకరాలకు పైగా గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు.  ఈ ఏడాది వర్షాలు ముందస్తుగా వచ్చే అవకాశం ఉండటంతో జూన్‌లోపే మొక్కలు నాటే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. మొక్కల సరఫరా. ఎరువులతోపాటు మొత్తం ఖర్చును ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు చెల్లిస్తారు.  ఒక్కొక్క మొక్కకు ఏడాదికి సగటున 40 మార్లు నీళ్లు పోసేందుకు వీలుగా రూ. 415 ఇవ్వనున్నారు. మొక్కల సంరక్షణ చేసినందుకు ప్రతి మొక్కకు రోజుకు 50 పైసలు చొప్పున చెల్లించనున్నారు. డ్రిప్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. డ్రిప్ అవకాశం  లేకపోతే  మెట్టభూముల్లో మొక్కల నీటి సరఫరాకు డబ్బును సమకూర్చనున్నారు.ఇన్ని సౌకర్యాలతో  ఆసరాగా ఉండే ఈ పథకం పనులు ఈ ఏడాది నత్తనడకన జరగడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
 
 అన్ని రకాల పనులు చేపడుతున్నాం
 ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో అన్ని రకాల పనులను చేపడుతున్నాం. కంపచెట్ల తొలగింపు, భూమి చదును, మట్టి తోలకం, పండ్ల మొక్కల పెంపకం పనులు ప్రధానంగా జరుగుతున్నాయి. కూలీల సంఖ్యను పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. కూలీల వేతన చెల్లింపులు వెంటనే చేస్తున్నాం. పనుల వేగం పెంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం.    
 - బాలసుబ్రమణ్యం, డ్వామా పీడీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement