కరుణించని అధికారులు..
► రేషన్ కార్డులో పేరున్నా... వేలిముద్రలు పడలేదని బియ్యం ఇవ్వని వైనం
►ఏడాది కాలంగా పింఛన్ కోసం ఎదురుచూపులు
►కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగం
►మీకోసంలో కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలు
కడప: అడుగులు వేయడానికే అవ్వకు కష్టం....అలాంటిది ఏడాది కాలంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. చేతిలో కర్ర ఉంటే తప్ప కదల్లేని పరిస్థితి. ఒకవైపు భర్త తనువు చాలించిన బాధ.. మరోవైపు కడుపు నింపుకునేందుకు కావాల్సిన బువ్వ కోసం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.. రేషన్‌కార్డులో పేరున్నా.. వేలి ముద్రలు పడలేదనే నెపం చూపి నెలల తరబడి అధికారులు బియ్యానికి ఎసరు పెట్టారు. భర్త మృతి చెంది ఏడాది దాటినా నేటికీ పింఛన్ అందడం లేదు. నడవలేకున్నా.. అంతో ఇంతో ఆసరా ఇస్తుందన్న ఆశతో పింఛన్, రేషన్ కోసం అవ్వ ఏడాదిగా పడుతున్న తిప్పలు చూసి కూడా అధికారులు కరుణించలేదు.
వీరబల్లి మండలం రామాపురం పంచాయతీ పరిధిలో నివాసముంటున్న కొండూరు వెంకట్రాజు ఏడాది క్రితం మృత్యువాతపడ్డాడు. అప్పటివరకు వెంకట్రాజుతోపాటు భార్య రెడ్డెమ్మ పేరు మీద ఉన్న రేషన్‌కార్డుపై బియ్యంతోపాటు ఇతర సరుకులు వచ్చేవి. తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ ఆ వృద్ధురాలికి బియ్యం రాలేదు.. పింఛన్ మంజూరు కాలేదు. దీంతో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. చూస్తాం...చేస్తాం...అన్న హామీలు తప్ప ఆమెకు న్యాయం జరగలేదు.
రేషన్ లేదు...పింఛన్ రాదు..
రెడ్డెమ్మకు రేషన్ కార్డు ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్‌ఏపీ 11380 1701345 నెంబరుతో రేషన్‌కార్డు మంజూరైంది. అయినా దాదాపు చాలా రోజులుగా సరుకులు ఇవ్వడం లేదు. కేవలం వేలి ముద్రలు పడటం లేదని మూడు, నాలుగు నెలలుగా సాకు చెబుతున్నారు. తీరా ఆరా తీస్తే ఇన్‌యాక్టివ్ పేరుతో కార్డునే తొలగించినట్లు తెలుస్తోంది. అలాగే పింఛన్ కోసం కూడా ఏడాది కాలంగా నిరీక్షిస్తోంది. ఒకటికి రెండుమార్లు దరఖాస్తు చేసినా బుట్టదాఖలు చేశారు. కనీసం భర్త చనిపోయిన తర్వాత వితంతువు పేరుతో అయినా ఇవ్వవచ్చు.. అదీ చేయలేదు.
కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న అవ్వ
ఎంతమందిని మొక్కినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కడప కలెక్టరేట్‌లో జరిగిన మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడును రెడ్డెమ్మ కలిసి గోడు వెళ్లబోసుకుంది. న్యాయం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంది. మరి ఆ వృద్ధురాలికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.