ప్రాణం తీసిన పింఛన్
ముద్దనూరు: ఆ వృద్ధురాలు ఉదయం నుంచి మద్యాహ్నం 3గంటల వరకు సామాజిక భద్రతా పింఛను కోసం పడిగాపులు గాసింది. చివరికి వేలిముద్రలు సరిపోక పోవడంతో పింఛను అందలేదు. గంటల తరబడి నిరీక్షణతో నీరసించిన ఆ వృద్ధురాలు అస్వస్థతకు గురై కన్నుమూసింది. ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మూడె సుబ్బమ్మ(75) నెలనెలా అందించే పింఛను కోసం మంగళవారం వెళ్లింది. ట్యాబ్‌లో వేలిముద్రలు సరిపోలేదు. దీంతో డబ్బులు పొందలేకపోయింది. పింఛను కోసం వేచి ఉండి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. తీరా పింఛను డబ్బులు అందకపోవడంతో ఇంటికి వెనుదిరిగింది. ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు చేసుకుని బీపీ తగ్గిపోయి నీరసించడంతో అస్వస్థతకు గురైంది. సుబ్బమ్మను కుటుంబీకులు 108 వాహనంలో మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆసుపత్రిలో మరణించినట్లు కుమారుడు బలరామనాయక్ తెలిపారు.