మొండి చేయి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలకు అర్థాలు మారుతున్నాయి. ‘ ఏరు దాటేంత వరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య’ అన్న సామెత చందాన ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికలు ముగిశాక ఇంకో మాట మాట్లాడుతున్నారు. వికలాంగుల పింఛన్‌ను రూ.1500కు పెంచుతానని హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగానే వికలత్వం ఆధారంగా పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించి తీవ్ర నిరాశను మిగిల్చారు.
కడప రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పింఛన్ల విషయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. ఎన్నికలకు ముందు రూ.1500 ఇస్తామని చెప్పి ఎన్నికల అనంతరం వికలత్వ శాతం ఆధారంగా రూ.1000, రూ.1500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని మాట మార్చడంతో వికలాంగుల్లో నిరాశ చోటు చేసుకుంది.
వికలాంగుల కేటగిరి కింద జిల్లాలో 30 వేల 651 మంది ప్రస్తుతం రూ. 500 చొప్పున పింఛన్ పొందుతున్నారు. పెంచిన పింఛన్ ప్రకారం వికలత్వం ఆధారంగా 40 నుంచి 79 శాతం లోపు వికలత్వం గల వారు 19 వేల 636 మంది, 80 శాతం పైబడి 100 శాతం లోపుగల వారు కేవలం 11 వేల 15 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 40 నుంచి 79 శాతం లోపు గల వారికి రూ. 1000, 80 నుంచి 100 శాతం లోపుగల వారికి రూ. 1500 చొప్పున పింఛన్ వస్తుంది. కాగా, ఎన్నికల ముందు ఉమ్మడిగా వికలాంగులకు రూ. 1500 ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఎన్నికల అనంతరం వికలత్వం పర్సెంటేజీ ఆధారంగా పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ ప్రకారం కేవలం 11వేల15 మంది మాత్రమే రూ. 1500 పింఛన్ పొందే అవకాశం ఉంది.
వికలత్వ శాతం అంటే ఎలా..
వికలాంగుల పింఛన్‌ను వికలత్వం ఆధారంగా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వికలాంగ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కొద్దిపాటి ప్రమాదానికి గురైనా తమ పనులను సక్రమంగా నిర్వర్తించుకోలేరు. అలాంటిది ఓ మోస్తరు వికలత్వం ఉన్నా ఎలాంటి పనులు చేసుకోలేరనడంలో సందేహం లేదు. వికలాంగుల సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా వికలత్వం ఆధారంగా పింఛన్లను పంపిణీ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత టీడీపీ హయాంలో 65 వేలు .. వైఎస్ హయాంలో 2.50 లక్షలకు పైగా పింఛన్లు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన గత తెలుగుదేశం పార్టీ పాలనలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కేటగిరీలకు సంబంధించి కేవలం 65 వేలకు పైగా మాత్రమే పింఛన్లు ఉండేవి. ఒకరికి రూ.75 చొప్పున పింఛన్ పంపిణీ చేసేవారు.
అది కూడా మూడు,నాలుగు నెలలకు ఒకసారి అందేది. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పింఛన్ల స్వరూపమే మారింది. ఫలితంగా జిల్లాలో అమాంతం పింఛన్ల సంఖ్య 2.50 లక్షలకు పెరగడంతోపాటు పింఛన్ల సొమ్ము రూ. 200కు పెరిగింది. అలాగే వికలాంగుల పింఛన్ రూ. 500కు పెంచారు. ప్రతినెల పింఛన్ సక్రమంగా పంపిణీ అయ్యేలా చూశారు.
పోరాటం తప్పదు
చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు వికలాంగులందరికీ రూ. 1500 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత వికలత్వం ఆధారంగా పింఛన్‌ను పంపిణీ చేస్తామని చెప్పడం తగదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు రూ. 1500 పింఛన్ ఇస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వం రూ. 1500 పింఛన్ ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం.
- ఎ.చిన్న సుబ్బయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు, ఏపీ వికలాంగ హక్కుల పోరాట సమితి
దారుణం
చంద్రబాబునాయుడు పర్సెంటేజీ ఆధారంగా వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పడం దారుణం. ఇచ్చిన మాటకు కట్టుబడి అందరికీ రూ. 1500 చొప్పున పింఛన్‌ను పంపిణీ చేయాలి.
- యు.రాచయ్య, నబీకోట, కడప.
మంచి పద్ధతి కాదు
పర్సెంటేజీ ఆధారంగా వికలాంగులకు పింఛన్లు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ రూ. 1500 చొప్పున పింఛన్‌ను పంపిణీ చేయాలి.
- సుబ్బనరసారెడ్డి, పుల్లంపేట