పేదల అభివృద్ధే ధ్యేయం
Published Mon, Dec 16 2013 7:04 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
నంద్యాల, న్యూస్‌లైన్: పేదల అభివృద్ధే ధ్యేయంగా తాను నిరంతరం పోరాడుతానని వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎం విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించిన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజల సమస్యలపైనా బాధితుల వెనువెంటే ఉండి పోరాటం చేస్తానని, అధికార పార్టీ అవాంతరాలకు జడిచే వ్యక్తిని కాదన్నారు. పట్టణంలో ఎంపీలను, ఎమ్మెల్యేలను శాసించే శక్తి ఉన్న మైనార్టీలను అధికార పార్టీకి చెందిన నాయకులు మాయ మాటలతో మోసగిస్తున్నారంటే వారి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పదేళ్ల నుంచి పట్టణంలోని మైనార్టీలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పింఛన్లు లేని వికలాంగులు, వృద్ధులు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన చెందారు.
మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన పేదలను ఎంపిక చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలం లోపే పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి వార్డులో ప్రధాన సమస్యలను గుర్తించడానికే డయల్ యువర్ భూమా, పరిష్కారం, క్లీన్‌సిటీ ఉద్యమాలను చేపట్టినట్లు తెలిపారు. దీంతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో తన కార్యక్రమాలకు అవరోధాలను కల్పిస్తున్నారని, వాటిని పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. పేదలు తనపై చూపుతున్న అభిమానంతోనే సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నానన్నారు. పట్టణంలో వార్డుకు 200మంది పేదలున్నారని, వీరందరికీ ప్రభుత్వ స్థలాల్లో అపార్ట్‌మెంట్‌లను నిర్మించి ఇళ్లను సమకూర్చుతామన్నారు.
భారీగా తరలి వచ్చిన మైనార్టీలు: జీఎం విద్యాసంస్థల అధినేత మహబూబ్‌పీరా ఆధ్వర్యంలో సలీంనగర్‌కు చెందిన 500కుటుంబాలు భూమా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అంతకుముందు పద్మావతినగర్‌లోని భూమా నివాసం నుంచి ఊరేగింపుగా ముస్లిం మైనార్టీలు ర్యాలీని నిర్వహించారు. అలాగే ఎంబీటీ బాబు, మహబూబ్‌పీరాల ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్సార్సీపీ కండువాలు ధరించి భూమా సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ కౌన్సెలర్ దాదాబాయ్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు ఖాన్‌ను, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు ఇస్మాయిల్, ఆత్మకూరు ముస్తఫా పాల్గొన్నారు.
Advertisement
Advertisement