నంద్యాలలో పోటీ చేస్తా
చంద్రబాబుకు తెగేసి చెప్పిన శిల్పా మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెగేసి చెప్పారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి శిల్పా సోదరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి పట్టుబట్టారు. ఒకవేళ సీటు రాకపోతే క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి తాను ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకుంటానని చెప్పారు. దీంతో తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని సీఎం సూచించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసన మండలి ఛైర్మన్ పదవి ఇస్తున్నాం కాబట్టి సహకరించాలని కోరారు.
భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినా తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని, తన సోదరుడికి మండలి ఛైర్మన్ ఇచ్చినా తన సీటు తనకివ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించినా మోహన్‌రెడ్డి వినిపించుకోకపోవడంతో... ఒకటి, రెండు రోజులు ఆగాక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. నంద్యాలలో తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పోటీ చేస్తారని, ఈ నెల 24న శోభానాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థిని ప్రకటిస్తామని మంత్రి అఖిలప్రియ చెప్పిన విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బయటకు వచ్చి మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికలో తాను వంద శాతం పోటీ చేస్తానని స్పష్టం చేశారు.