‘నన్ను జైల్లో పెట్టించడం నీ తరం కాదు’
నంద్యాల: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శిల్పా మోహన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరి తిట్లకు దారి తీసింది. తాజాగా శిల్పా మోహన్ రెడ్డిపై నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘శిల్పా మోహన్ రెడ్డి లాంటి నేతలను వేల మందిని చూశాను. నన్ను జైల్లో పెట్టించడం నీ అబ్బ తరం కాదు. నా మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దు. మోహన్ రెడ్డి వల్లే కుందు నది ఆక్రమణలకు గురైంది. శిల్పా 12 ఏళ్లలో 12 ఇళ్లు మంజూరు చేయించలేకపోయారు. నేను ఐదు నెలల్లో నంద్యాల నియోజకవర్గానికి రూ. 500 కోట్లు నిధులు మంజూరు చేయించాన’ని భూమా నాగిరెడ్డి అన్నారు.
జనచైతన్య యాత్ర వేదికగా ఇంతకుముందు ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ‘ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తాం. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారు. ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులను కేటాయించారో వివరాలతో వెల్లడించాలి. ఆలోచించి మాట్లాడండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమ’ని శిల్పా మోహన్ రెడ్డి అంతకుముందు ధ్వజమెత్తారు.