
టీడీపీకి నిధులిచ్చిన వారితో సలహా కమిటీయా?
చంద్రబాబుపై ధ్వజమెత్తిన రఘువీరా రెడ్డి
విజయవాడ బ్యూరో: ఎన్నికల్లో టీడీపీకి నిధులిచ్చిన వారితో రాజధాని సలహా కమిటీ నియమించారని సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఈ కమిటీలో ఒక్కరైనా ఏ రంగంలోని నిపుణులైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటు పేరిట జరుగుతున్న భూ దందాలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని విమర్శించారు.
ఎన్నికలకు ముందే రాజధాని విషయంలో ఒప్పందాలు జరిగి భూముల ధరలు పెంచుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. స్థానిక ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం షరతులు లేని రుణ మాఫీకి నిర్ణయం తీసుకోకపోతే రెండు రోజుల్లో కాంగ్రెస్ ప్రముఖులందరితో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ విషయంలో సర్కారు మెడలు వంచుతామని రఘువీరా అన్నారు.