సీఎంపై నిర్భయ కేసు పెట్టాలి
ఎన్.రఘువీరారెడ్డి, సి.రామచంద్రయ్య డిమాండ్
సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్తే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. ఏపీలో మాత్రం ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను సిగ్గు లేకుండా టీడీపీలోకి ఆహ్వానిస్తూ ప్రజాస్వామ్యాన్ని రేప్ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్యలు ధ్వజమెత్తారు. అందుకుగాను చంద్రబాబుపై నిర్భయ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహణ కోసం రూ.కోట్లు ఖర్చు చేసి, షెడ్డులో ఉన్న కారుతో మహిళను పోలుస్తూ స్పీకర్ గొప్ప సందేశం ఇస్తే సీఎం చంద్రబాబు దానిని సమర్థించడం శోచనీయమన్నారు.
25న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు: రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను తెలిజేస్తూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు రఘువీరారెడ్డి, రామచంద్రయ్య తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దుష్పరిణామాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ‘జన ఆవేదన సమ్మేళనం’ పేరుతో 175 నియోజకవర్గాల్లో వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.