కొంత సంతృప్తి.. మరింత అసంతృప్తి! | NABH Team Visit Government Hospital In Krishna | Sakshi
Sakshi News home page

కొంత సంతృప్తి.. మరింత అసంతృప్తి!

Published Mon, Feb 18 2019 1:03 PM | Last Updated on Mon, Feb 18 2019 1:03 PM

NABH Team Visit Government Hospital In Krishna - Sakshi

ప్రభుత్వాస్పత్రి అధికారులతో సమావేశమైన ఎన్‌ఏబీహెచ్‌ బృందం

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రభుత్వాస్పత్రిలో సేవలపై అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ హాస్పటల్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) బృందం మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి కొంత సంతృప్తి.. అధిక శాతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు, శానిటేషన్, బయోమెడికల్‌ మేనేజ్‌మెంట్, అత్యవసర వైద్యం అందుతున్న తీరు, డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలపై దృష్టి సారించింది. పలు అంశాలపై సంతృప్తి వ్యక్తం చేయగా, మరికొన్ని విభాగాల్లో లోపాలను గుర్తించారు. ఇలా 80 అంశాలతో కూడిన లోపాలను గుర్తించి వాటిని మూడు నెలల్లో సరిదిద్దుకోవాలని ఆస్పత్రి అధికారులకు సూచించారు. అప్పుడు మళ్లీ తనిఖీలు నిర్వహించి ఎన్‌ఏబీహెచ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు.

కేస్‌షీట్‌ల నిర్వహణ అస్తవ్యస్తం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కేస్‌ షీట్‌ల మెయింటెనెన్స్‌ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఎ¯Œఏబీహెచ్‌ బృందం గుర్తించింది. రోగిని ఎవరు చూస్తున్నారు. మందులు ఎవరు రాశారు. ఇన్వెస్టిగేషన్‌ వివరాలు, వైద్యుని పేరు, డిజిగ్నేషన్‌ వంటి వివరాలు ఉండాలన్నారు. కానీ అలాంటివేవి లేకపోవడాన్ని గుర్తించారు. ఎన్‌ఏబీహెచ్‌ నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగి డిశ్చార్జి అయ్యేటప్పుడు రోగికి ఇచ్చే డిశ్చార్జి షీట్, ఆస్పత్రిలో కూడా ఒకటి ఉండేలా చూడాలని సూచించారు. కొన్ని కేస్‌ షీట్‌లు అస్తవ్యస్తంగా ఉండటాన్ని వారు గమనించారు. 

సేవలపై అవగాహన లేమి
వార్డులో చికిత్స పొందుతున్న రోగికి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు ఎలా స్పందిస్తారని నర్సింగ్‌ సిబ్బందిని ఎన్‌ఏబీహెచ్‌ బృందం అడగ్గా కొందరు  చెప్పలేకపోయారు. పల్మనరీ కార్డియో రీససిటేష¯Œన్‌ (పీసీఆర్‌) విధానం ఎలా చేస్తారని అడగ్గా కొందరు నర్సింగ్‌ సిబ్బంది చేసి చూపించలేకపోవడాన్ని వారు లోపంగా రాశారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగికి మందుల వాడకం, వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు వంటి అంశాల్లో కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా వార్డులో పేషెంట్‌ కేర్‌ సరిగ్గా లేదని బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డులో ఉండే సిబ్బందికి అన్నింటిపై అవగాహన ఉండాలని సూచించారు. ఈ అంశాల్లో అవగాహన పెంచుకోవాలన్నారు.

ల్యాబ్‌ సరిగ్గాలేదు
ల్యాబ్‌లో బయోమెడికల్‌ వేస్ట్‌ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు, పర్యవేక్షణ కూడా సరిగ్గా లేదని ఎన్‌ఏబీహచ్‌ బృందం పేర్కొంది. ఇక్కడ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. సూపరింటెండెంట్, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. లేబొరేటరీ విభాగాలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పర్యవేక్షణలో ఉండటంతో ఈ పరిస్థితి           దాపురించింది.

గైనిక్, ఎస్‌ఎన్‌సీయూ బాగుంది
పాత ప్రభుత్వాస్పత్రిలోని న్యూబర్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. గైనకాలజీలో ఎక్కువ మంది రోగులు ఉన్నారని, సేవలు కూడా బాగున్నాయన్నారు. పిడియాట్రిక్, ఆర్థోపెడిక్‌ విభాగాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌ఏబీహెచ్‌ బృందం, మెడిసిన్, జనరల్‌ సర్జరీ విభాగాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఏబీహెచ్‌ బృందంలో డాక్టర్‌ కృష్ణజ్యోతి గోస్వామి, డాక్టర్‌ అనిరుద్దముఖర్జీ, డాక్టర్‌ చిన్మయి షాహ్, షైను వర్గీస్, నిహార్‌ బాటియా ఉన్నారు. వారి వెంట సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.బాబూలాల్, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌.గీతాంజలి, డీసీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ శోభ, ఎన్‌ఏబీహెచ్‌ స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అరవింద్, కొత్తాస్పత్రి నోడల్‌ ఆఫీసర్స్‌ డాక్టర్‌ ఉష, పాత ఆస్పత్రి నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉషారాణి, అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి,   అడ్మినిస్ట్రేటర్స్‌ సౌమ్య, రోష్నారా, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు పాగోలు శ్రీనివాసరావు, పీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement