ఆహారం..అధ్వానం | Diet Contractors Corruption In Meal In Hospital Krishna | Sakshi
Sakshi News home page

ఆహారం..అధ్వానం

Published Sat, Sep 15 2018 1:22 PM | Last Updated on Sat, Sep 15 2018 1:22 PM

Diet Contractors Corruption In Meal In Hospital Krishna - Sakshi

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నాసిరకం బియ్యంతో వండిన అన్నం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం,  జననీ శిశు సురక్ష కార్యక్రమాలు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రుల్లో అధ్వానంగా అమలవుతున్నాయి. రోగులకు కుళ్లిన కోడిగుడ్లు, పుచ్చిన పండ్లు, నీళ్ల పాలు, మజ్జిగ అందిస్తున్నారు. ఆహార కొలతల్లోనూ తేడా చూపుతూ రోగుల కడుపుకొట్టి కాంట్రాక్టర్‌ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  డైట్‌ కాంట్రాక్టు పొందిన వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్సీకి సన్నిహితుడు, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రికి అత్యంత ఆత్మీయుడు కావడంతో నాసిరకం ఆహారం అందిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని పాత, నూతన ఆస్పత్రులతోపాటు ఆయుష్, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో చేరిన ఇన్‌పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం ద్వారా నిత్యం దాదాపు 1,350 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులతో చేరిన రోగులకు మాత్రం సాధారణ డైట్‌ కింద ఒక్కో రోగికి రూ.40 చొప్పున.. హెచ్‌పీ డైట్‌ రోగికి రూ.56 వంతున ఇస్తున్నారు. అలాగే, జననీ శిశు సురక్ష కార్యక్రమంలో ప్రసవం జరిగిన బాలింతకు రూ.100 వంతున.. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లకు రూ.80 వంతున అందిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టెండర్‌ ద్వారా డైట్‌ కాంట్రాక్టు దక్కించుకునే కాంట్రాక్టర్‌ ఆయా రోగులకు మూడు పూటలా ఆహారం అందించాలి.

మెనూ ఇలా..
సాధారణ రోగులకు ఉదయం అల్పాహరం కింద మూడు ఇడ్లీలను చెట్నీ లేదా సాంబారుతో ఇస్తారు. లేదా కిచిడి, ఉప్మా, బ్రెడ్‌ ఇవ్వవచ్చు. దాంతో పాటు 100 మి.లీ. పాలు ఇవ్వాలి. మధ్యాహ్నం భోజనం కింద 600 గ్రాముల రైస్‌తోపాటు 150 గ్రాముల వెజ్‌ కర్రీ, 200 ఎంఎల్‌ సాంబారు, గుడ్డు, 100 ఎంఎల్‌ పెరుగు లేదా 200 ఎంఎల్‌ మజ్జిగతో పాటు అరటి పండు ఇవ్వాలి. రాత్రి భోజనంలోకి 450 గ్రాముల రైస్‌తో పాటు వెజ్‌ కర్రీ, సాంబారు, గుడ్డు అందించాలి. అలాగే, రోగికి మూడుపూటల 500ఎంఎల్‌ పాలు అందించాలి.

హెచ్‌పీ డైట్‌ ఇలా..
హెచ్‌పీ డైట్‌లో ఉదయం అల్పాహారం కింద మూడు ఇడ్లీలను చెట్నీ లేదా సాంబారుతో ఇస్తారు. లేదా కిచిడి, ఉప్మా, బ్రెడ్‌ ఇవ్వవచ్చు. దాంతోపాటు 150 మి.లీ. పాలు, 100 గ్రాముల బ్రెడ్‌ ఇవ్వాలి. మధ్యాహ్నం భోజనంలో 600 గ్రాముల రైస్‌తో పాటు 150 గ్రాముల వెజ్‌కర్రీ, 200 ఎంఎల్‌ సాంబారు, గుడ్డు, 100 ఎంఎల్‌ పెరుగు లేదా 200 ఎంఎల్‌ మజ్జిగతో పాటు అరటి పండు ఇవ్వాలి. సాయంత్రం వేళ 150 ఎంఎల్‌ పాలు ఇవ్వాలి. రాత్రి భోజనంలోకి  600 గ్రాముల రైస్‌తో పాటు 150 గ్రాముల వెజ్‌ కర్రీ,, 200 ఎంఎల్‌ సాంబారు, గుడ్డు, 100 ఎంఎల్‌ పెరుగు లేదా 200 ఎంఎల్‌ మజ్జిగతో పాటు అరటి పండు ఇవ్వాలి.
జేఎస్‌ఎస్‌కే పథకంలో భాగంగా ఉదయం అల్పాహారం కింద నాలుగు ఇడ్లీలు చెట్నీ లేదా సాంబారుతో కలిపి ఇస్తారు. లేదా కిచిడి, ఉప్మా, బ్రెడ్‌ ఇవ్వవచ్చు. దాంతో పాటు 250 మి.లీ. పాలు, 1006 గ్రా. బ్రెడ్‌ ఇవ్వాలి. మధ్యాహ్నం 450 గ్రాముల రైస్‌తో పాటు 150 గ్రాముల వెజ్‌ దాల్, 150 ఎంఎల్‌ సాంబారు, గుడ్డు, 200 ఎంఎల్‌ పెరుగు ఇవ్వాలి. సాయంత్రం వేళ 150 ఎంఎల్‌ పాలు, చిక్కీ లేదా లడ్డు ఇవ్వాలి. రాత్రి డిన్నర్‌లోకి 450 గ్రాముల రైస్‌తో పాటు 100 గ్రాముల వెజ్‌ కర్రీ, 150 ఎంఎల్‌ సాంబారు, 200 ఎంఎల్‌ పెరుగుతోపాటు అరటి, యాఫిల్‌ లేదా బత్తాయి పండ్లు రెండేసి ఇవ్వాలి.

నాసిరకం పదార్థాల వడ్డన..
కానీ, కాంట్రాక్టర్‌ మెనూ అమలును పాటించడంలేదు. హెచ్‌పీ డైట్‌లో కేవలం 450 గ్రాముల రైస్‌ను అందిస్తున్నారు. బాలింతలకు అందించే పండ్లు చిన్నవిగా, పుచ్చిపోయి ఉంటున్నాయి. పాలు ఇవ్వడంలేదు. సాంబారు నీళ్లగా ఉంటుండడంతో బాలింతలు తినలేపోతున్నారు. శనగ విత్తనాలు 125 గ్రాములకు గాను.. 100 గ్రాములే ఉంటున్నాయని.. అవి కూడా నాసిరకం కావడంతో తినేందుకు ఇబ్బందిగా ఉందని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, నిత్యం 20 లేదా 30 మందికి తగ్గించి ఆహారం పంపుతుండడంతో ఉన్నదాన్నే సర్దుబాటు చేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు సర్టిఫై చేసిన వస్తువుల ద్వారానే కొలతలు వేయాల్సి ఉన్నా అలా జరగడంలేదు. అలాగే, ప్రతి మూడు నెలలకోసారి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ భోజనం శాంపిల్స్‌ తీసి గుంటూరులోని రీజినల్‌ ల్యాబొరేటరీకి పంపి నాణ్యత పరిశీలించాలి. కానీ, నాలుగేళ్లగా శాంపిల్స్‌ తీసిన పాపాన పోలేదు.

ఉచితంలో ఆదాయం..
ఇదిలా ఉంటే.. విజయవాడలోని అన్ని ఆస్పత్రులకు ఒక్క కిచెన్‌ ద్వారానే భోజనం తయారీచేసి మిగిలిన అన్ని ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి ఆస్పత్రిలో కిచెన్‌ ఉండాల్సి ఉన్నా అలా చేయటంలేదు. కొత్త ఆసుపత్రిలో ఉండే కిచెన్‌లోనే అన్ని ఆస్పత్రులకు అవసరమైన ఆహారం వండించి రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని విద్యుత్‌తోపాటు ఆసుపత్రులకు కేటాయించే సబ్సిడి గ్యాస్, నీరు ఉపయోగించుకుంటున్నారు. దీంతో కాంట్రాక్టర్‌కు కిచెన్‌ లేని చోట విద్యుత్, గ్యాస్, నీరు వాడకంతో పాటు మ్యాన్‌ ఫవర్‌ తగ్గుతోంది. గత నాలుగేళ్లగా ఇలా చేయడం వల్ల రూ.లక్షల్లో ఆదాయం ఆర్జించినట్లు తెలిసింది.

ఫిర్యాదులు బుట్టదాఖలు...
ఆస్పత్రులలో నాసిరకం డైట్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ఆధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. పాత ఆస్పత్రిలో రోగులతోపాటు అక్కడ సిబ్బంది పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల కృష్ణాజిల్లాలోని కంచికచర్ల మండలం గొట్టుముక్కలకు చెందిన కూచిపూడి ప్రియ నాసిరకం భోజనం చేసి అనారోగ్యం బారిన పడినట్లు ఫిర్యాదు చేసింది. అయినా కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. గతంలో కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సదరు కాంట్రాక్టర్‌పై పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇటీవల జిల్లాలోని కూచిపూడికి చెందిన పెరుమాళ్ల కల్పన అనే గర్భిణి ప్రసవం కోసం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని గైనిక్‌ వార్డులో చేరింది. ఆమెకు జేఎస్‌ఎస్‌కే పథకం ద్వారా ఆహారం అందించగా వాంతులు, విరేచనాలయ్యాయి. వైద్యులు ఆమెను పరిశీలించి తిన్న ఆహారం విషతుల్యం కావడంతో ఇలా జరిగిందని చెప్పారు. ఇదీ రాజధాని నగరం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న దుస్థితి

ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనంపై ఫిర్యాదులు రాలేదు. వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రోగులు, సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు ఆధారాలు చూపడంతో వాటిని పరిశీలిస్తున్నామంటూ మాట దాట వేశారు.– గీతాంజలి, ఆర్‌ఎం విజయవాడప్రభుత్వాస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement