
హుకుంపేట పాఠశాలలో ఆధునికీకరించిన మరుగుదొడ్లు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యారంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ‘మన బడి నాడు–నేడు’ పేరుతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 4412 ప్రాథమిక , ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి వాటిని మౌలిక వసతుల పరంగా కార్పొరేట్ పాఠశాలల స్థాయికి అభివృద్ధి చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1382 పాఠశాలలు ఎంపిక చేసి వాటిని తొమ్మిది విభాగాల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలుత ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం జూన్ నాటికి పూర్తి చేయాలని భావించిన లాక్‌డౌన్ నేపథ్యంలో జులై నెలాఖరు వరకు పొడిగించి పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ ఉన్నత అధికారులు సూచించారు. ముందస్తు పైలట్ ప్రాజెక్టు స్కూల్‌గా జిల్లాలో హుకుంపేట, కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం, మడికి గ్రామాల్లో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి ఈ నెలాఖరుకు పనులు పూర్తి చేయనున్నారు.
ఆ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఇలా..
నిరంతర తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లకు నిరంతరం వాడుక నీరు, విద్యార్థులకు ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు, గదులకు మరమ్మతులు, డిజిటల్ తరగతులు, బ్లాక్‌బోర్డు, ప్రహరీల నిర్మాణం, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి వాటిని అభివృద్ధి చేయనున్నారు.
సకాలంలో పనులు పూర్తి చేస్తాం
నాడే–నేడు పనులు సకాలంలో పూర్తిచేస్తాం. లాక్‌డౌన్ నుంచి వీటికి మినహాయింపు కల్పించారు. ఇప్పటి వరకు 16.20 కోట్లు రాగా మరో రూ.25 కోట్లు రెండు రోజుల్లో వస్తాయి. నిధులు ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో నేరుగా జమవుతున్నాయి. పనులు సర్వశిక్షాఅభియాన్, ట్రైబుల్ వెల్ఫేర్, ఏపీడబ్లూఈసీ విభాగాలకు కేటాయించారు. – పి.విజయకుమార్, సమగ్ర శిక్షాఅభియాన్ ఏపీసీ