మాయల మాంత్రికుడు చంద్రబాబు
నరసాపురం అర్బన్ : మాయల మాంత్రికుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి భంగపడిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు అండగా నిలబడదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక తెలగా కల్యాణమండపంలో నిర్వహించిన పార్టీ నరసాపురం నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదని విమర్శించారు. రైతు రుణమాఫీకి చంద్రబాబు కేటాయిస్తానని చెబుతున్న రూ.5 వేల కోట్లు కనీసం వడ్డీ మాఫీకి కూడా సరిపోవన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
అదికూడా పార్టీ కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకుల మనోభావాలకు అనుగుణంగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు మోసాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. వచ్చేనెల 5న కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మహాధర్నా పోస్టర్‌ను ఆళ్ల నాని ఆవిష్కరించారు. పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేలా, ప్రభుత్వం మెడలు వంచే విధంగా ప్రభుత్వంపై పార్టీ కార్యకర్తలు కలసికట్టుగా పోరాడాలని సూచించారు. ప్రజాసంక్షేమం పట్టకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకే దొరకకుండా చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు చేస్తున్నారని, హైదరాబాద్‌లో ఉంటే టెలీకాన్ఫెరెన్స్‌తో కాలంవెళ్ల దీస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తప్పుడు విధానాలతో ఇసుక కొరతను సృష్టిస్తున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కిలో బియ్యం రేషన్‌లో రూపాయికి దొరుకుతుంటే, మరో వైపు కేజీ ఇసుక రూ.10కు కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. సభకు పార్టీ పట్టణ కన్వీనర్ నల్లిమిల్లి జోసఫ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో పార్టీ జిల్లా క్రమశిక్షణాసంఘం సభ్యుడు సాయినాథ్ ప్రసాద్, కొత్తపల్లి భుజంగరాయలు (నాని), పాలంకి ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లం ఆనందప్రకాష్, బీసీ సెల్ అధ్యక్షుడు గంటా ప్రసాద్, మహిళా విభాగం కన్వీనర్ వి.సాయిబాలపద్మ, ఏలూరు టౌన్ కన్వీనర్ శ్రీనివాస్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గూడూరి ఉమాబాల, మొగల్తూరు మండల కన్వీనర్ కర్రి ఏసు, బొక్కా రాధాకృష్ణ మాట్లాడారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో నరసాపురం నియోజకవర్గ పార్టీ తరఫున ఆళ్ల నానిని కొత్తపల్లి సోదరులు ఘనంగా సత్కరించారు. తొలుత ఆళ్ల నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వచ్చేనెల 5న నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.