గురుకుల ఆవరణలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కిలివేటి
నాయుడుపేటటౌన్: నెల్లూరు జిల్లా ‘నాయుడుపేట గురుకులంలో పరిస్థితి ఇంత దారుణమా?, దళిత విద్యార్థులంటే ఇంత చులకనా’ అంటూ వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గురుకులాన్ని బుధవారం ఆయన ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీ, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కౌన్సిలర్‌లు కేఎంవీ కళాచంద్ర, పలువురు నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎమ్మెల్యే వంటగది వద్దకు వెళ్లారు. అపరిశుభ్ర పాత్రల్లో వంటలు చేస్తుండటం, మురికిమయంగా ఉన్న గ్రైండర్‌లోనే ఆకుకూర పప్పు వేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసి ఇదేం పద్ధతి అంటూ కేర్ టేకర్‌గా ఉన్న గురుకుల పీడీ శ్రీరేష్‌పై మండిపడ్డారు.
మోనూ ప్రకారం బుధవారం విద్యార్థులకు బెండకాయ తాళింపు వేయకపోవడాన్ని గుర్తించారు. అలాగే అన్నం సక్రమంగా వండకుండా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసి ఉండటం చూసిన కిలివేటి ‘మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే పెడతారా’ అని వారిని ప్రశ్నాంచారు. పురుగులు పట్టిన బియ్యం, చెడిపోయిన కూరగాయలు, నాసిరకంగా ఉండే పప్పులు తదితరాలు స్టోరూంలో నిల్వలు చేసి ఉండటం చూచి ఇవేనా దళిత విద్యార్థులకు వండి పెడుతోంది అంటూ ఆగ్రహించారు. ‘ఎస్సీ విద్యార్థులంటే అంతా చులకనా’ అంటూ గురుకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. అనంతరం తరగతి గదుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తమ బిడ్డలు గురుకులంలో అధ్వాన పరిస్థితుల మధ్య చదువులు సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ఇళ్ల వద్ద ఇలాగే పెట్టుకుంటారా?
విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు దుర్గందభరితంగా ఉండటం చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. మరుగుదొడ్ల పక్కనే విద్యార్థుల వసతి భవానలు ఉండటంతో పారిశుద్ధ్యం పనులు చేపట్టపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మీ ఇళ్ల వద్ద ఇలాగే పెట్టుకుంటారా అంటూ వారిని నీలదీశారు. గురుకులంలో పనిచేస్తున్న అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటూ దళిత విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి పాదర్తి హరిరెడ్డి, నాయకులు దొంతాల రాజశేఖర్‌రెడ్డి, పార్టీ తిరుపతి పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యదర్శి చేవూరు చెంగయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి రత్నశ్రీ, విద్యార్థి విభాగం నాయకులు వెంకటేష్, ఇరుగు సాయి, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment