నల్లగొండ పట్టణాభివృద్ధికి.. రూ.89.78 కోట్లు
నల్లగొండ, న్యూస్‌లైన్ : నల్లగొండ పట్టణంలో డ్రెయినేజీ సమస్య త్వరలో తీరనుంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ వాటిని అనుసంధానించాల్సిన మురుగు శుద్ధి కేంద్రం ట్యాంకుల నిర్మాణంలో జాప్యం ఏర్పడింది. దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఎస్టీపీల నిర్మాణానికి భూసేకరణ పూర్తయినా నిధులు మంజూరుకు ప్రభుత్వం మోకాలొడ్డిం ది. ఎన్నికలకు ముందే నిధులు మంజూరు కావాల్సి ఉన్నా అప్పటి సీఎం ఉద్దేశ్యపూర్వకంగానే నిధులు విడుదల చేయకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సందర్భాల్లో ధ్వజమెత్తారు. అయితే కోమటిరెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఎస్టీపీ ట్యాంకుల నిర్మాణం కూడా ఉంది.
ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణమే తొలి విడత కింద ఎస్టీపీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రాష్ర్టస్థాయి అధికారులతో స్వయంగా చర్చలు జరిపి నిధులు మంజూరుకు కృషి చేశారు. నల్లగొండ శివారు ప్రాంతంలోని శేషమ్మగూడెం వద్ద ఎస్టీపీ-1, వల్లభాపురం చెర్వువద్ద ఎస్టీపీ-2 ట్యాంకు లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.89.78 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ నుంచి జీఓ నం.60 జారీ అయింది. పనులకు సంబంధించి పది రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. నెల రోజుల్లో ఎస్టీపీ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి తెలిపారు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన మిగతా హామీలను కూడా త్వరలో నెరవేరుస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు.