
పోలవరం ప్రాజెక్టు పేరు మార్పు
ఇందిర పేరు తొలగింపు
అభ్యంతరం వ్యక్తం చేసిన రఘువీరా
హైదరాబాద్: ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు పేరు నుంచి ‘ఇందిరా సాగర్’ను ప్రభుత్వం తొలగించి.. ‘పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. ఈమేరకు ఏక వాక్య ఉత్తర్వులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ గురువారం జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 2005 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది.
సాధారణంగా జాతీయ హోదా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో 90 శాతం కేంద్రం సమకూరుస్తుంది. మిగతా 10 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కానీ పోలవరం విషయంలో.. పూర్తి వ్యయం కేంద్రమే భరిస్తుందని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. జాతీయ హోదా దక్కి ఏడాది పూర్తయినా.. ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి శూన్యం. నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి వీలుగా ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ’ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. తమ చేతుల్లో నుంచి ప్రాజెక్టు జారీ పోకుండా ఉండటానికి, కాంట్రాక్టర్‌ను కాపాడడం కోసం ప్రాజెక్టుకు ‘చంద్ర గ్రహణం’ పట్టించిన విషయం విదితమే. ప్రాజెక్టు పేరు మార్చడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే వేగంగా పూర్తికావడానికి అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు.
రఘువీరా అభ్యంతరం
పోలవరం ప్రాజెక్టు నుంచి ఇందిర పేరు తొలగించడం పట్ల ఏపీ పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టులో ‘ఇందిర’ అనే పేరును తొలగిస్తూ మార్పు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశం గర్వించదగిన నాయకురాలి పేరు తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకి రాజకీయ భిక్ష, మంత్రి పదవి ఇచ్చి ఎన్టీఆర్‌కు అల్లుడు కావడానికి కారణమైన ఇందిరగాంధీ పేరునే ప్రాజెక్టు నుంచి తొలగించడం ఆయన కుచ్చిత బుద్ధికి తార్కాణం అన్నారు. ప్రాజెక్టుకు పేరు మారుస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని పీసీసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.