- బరిలో నలుగురు
- టీడీపీ, కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు
నందిగామ : నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థుల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో రెండింటిని తిరస్కరించారు. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులు మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య పోటీలో ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు అకాల మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది.
తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీల నాయకులను విజ్ఞప్తి చేసింది. సంప్రదాయాన్ని గౌరవించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీకి అభ్యర్థిని పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం బోడపాటి బాబురావును అభ్యర్థిగా బరిలో దింపింది. వీరికి తోడు మరో ఇద్దరు నామినేషన్లు వే సి రంగంలో ఉండడంతో ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ పోటీ అనివార్యమైంది. నలుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు తెలిపారు.