నంద్యాల ఘటనపై సీఎంకు ఫిర్యాదు
► టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి
► వలస నేతలు సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపణ
కర్నూలు: టీడీపీ లీగల్‌సెల్ జిల్లా కార్యదర్శి తులసిరెడ్డిపై నంద్యాలలో జరిగిన హత్యాయత్నం ఘటనపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. ప్రతిపక్షం నుంచి పాలకపక్షంలోకి చేరిన పలువురు నాయకులు వారి ప్రాముఖ్యతను చాటుకునేందుకు పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండా అమలు చేస్తున్నారని విమర్శించా రు. నంద్యాల ఘటన విషయంలో ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు. అలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులు ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. పార్టీలో కొత్త, పాత నాయకులు కలవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.
కొత్తగా పార్టీలో చేరిన వారు పార్టీకి నష్టం కలిగించే విధంగా రాజకీయ ప్రకటనలు చేయవద్దని సూచించారు. శాసన మండలి సమావేశం సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి హామీ పొంది నట్లు వెల్లడించారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు రూ.21 కోట్ల విడుదల, సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి నిధులు, శ్రీశైలంలో వంద పడకల ఆయుర్వేద ఆసుపత్రి, తిరుపతి తిరుమల తరహాలో శ్రీశైలం, సున్నిపెంట అభివృద్ధికి సీఎం నుంచి హామీ పొందామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రసాని నాగేశ్వర్‌రావు యాదవ్, కేడీసీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.