ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది: సీఎం
పుష్కలంగా నీరుంటే బ్యాంకుల్లో డబ్బున్నట్టే
కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది.. ప్రజలు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. గతంలో విశాఖపట్నంలో వచ్చిన తుపానును అక్కడివారు ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వానికి సహకరించారని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని వారు కూడా సహకరించాలని కోరారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మూడోరోజు ఆదివారం సోమశిల రిజర్వాయర్‌ను పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని కండలేరుకు విడుదల చేశారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజీలతోపాటు కాలువలను పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలనేదే తన సంకల్పమని చెప్పారు.
కృష్ణా-పెన్నా నదుల్ని కలుపుతాం
భవిష్యత్‌లో కృష్ణా, పెన్నానదులను కలిపే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. అన్ని రిజర్వాయర్ల నుంచి కాలువలు లేదా ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఎకరా పంట పండే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రతినీటి బొట్టు విలువైందని.. నీరు డబ్బుతో సమానమని చెప్పారు. పుష్కలంగా నీరుంటే బ్యాంకులో డబ్బులు ఉన్నట్టేనన్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని, అందుకోసం ఓ శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు. అధికారులు తన స్పీడును అందుకోవడంలేదన్నారు. అనంతరం సీఎం రోడ్డుమార్గాన వెళ్లి మనుబోలు వద్ద కోసుకుపోయిన రహదారిని పరిశీలించి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెళ్లారు.
వర్షాలతో పెరిగిన భూగర్భ జలాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇటీవల కురిసిన వర్షాల వల్ల చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు రెండు మీటర్ల మేర పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వర్షాలకు చిత్తూరు జిల్లాలో జరిగిన పంట నష్టంపై ఆయన ఆదివారం రాత్రి శ్రీకాళహస్తిలో అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాలతో 200 టీఎంసీల నీరు అదనంగా వచ్చిందని తెలిపారు. ఎక్కడికక్కడ నీటిని నిల్వచేసే కార్యక్రమం చేపడతామన్నారు. భూమిని జలాశయంగా మార్చుకునే ప్రణాళికలను చేస్తున్నామని చెప్పారు. అనంతరం వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, కలెక్టర్ సిద్ధార్థజైన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు.