బాబు వచ్చాడు...జాబ్ పోయింది
- ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల్లో ఊరూవాడ చంద్రబాబు ప్రచారం
- గెలిచాక అవుట్ సోర్సింగ్ సిబ్బందిని దశలవారీగా తొలగిస్తున్న ప్రభుత్వం
- ఇప్పటికే జిల్లాలో 264 మంది సిబ్బంది తొలగింపు
- వివిధ శాఖల్లోని 6 వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం..!
- బాబు వైఖరిపై టీడీపీ శ్రేణులే బిత్తరపోతున్న వైనం
జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ నేతలు కనిపించిన గోడలపైనంతా రాసేశారు.. తాను అధికారంలోకి వస్తే ఇంటికో ఊద్యోగం ఇస్తానంటూ ఆపార్టీ అధినేత చంద్రబాబు ఊరూవాడ ఊదరగొట్టారు. ఇది ఎన్నికల ప్రచారమప్పటి మాట..! మరి ఇప్పుడేం జరుగుతోంది.. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారా? ఉన్న ఊద్యోగాలను తీసేస్తున్నారా?.. అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే ఈ కథనం చదవండి మరి...
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడటం అంటే ఇదేనేమో..! తాను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే గృహనిర్మాణశాఖ, సాంకేతిక విద్యాశాఖల్లో పనిచేస్తున్న 264 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆరు వేల మందికిపైగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని దశలవారీగా తొలగించడానికి చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది.
వివరాల్లోకి వెళితే..
సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుండడంతో గతంలో ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పలు శాఖల్లో ఉద్యోగులను తీసుకుంది. పదేళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తక్కువ వేతనంతో అధిక పనిభారం మోస్తోన్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది.
ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం పేరుతో వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. జిల్లాలోని గృహనిర్మాణశాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, డేటా ఆపరేటర్లుగా పనిచేస్తున్న 201 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలో 76 మంది ఇదే పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇందులో 13 మంది సెలవులో ఉన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 63 మందిని తొలగిస్తూ మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తీరుతో మనస్థాపం చెందిన కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ తులసీకృష్ణ సోమవారం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు.
దశలవారీగా తొలగింపు..
జిల్లాలో ఉపాధిహామీ, ఇందిరా క్రాంతిపథం, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు, విద్యుత్.. తదితర శాఖల్లో ఆరువేల మందికిపైగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఇందులో గృహనిర్మాణం, సాంకేతికవిద్య శాఖలో పనిచేస్తున్న 264 మందిని ఇప్పటికే తొలగించారు. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సైతం దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యవసాయశాఖలో రైతులకు సేవలు అందిస్తున్న ఆదర్శ రైతులను నేడో రేపో తొలగించనున్నారు. ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్న 811 మందినీ తొలగించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోపాలమిత్రలుగా పాడి రైతులకు సేవలు అందిస్తున్న 420 మందిని తొలగించనుంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం పేరుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డున పడేస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యమాలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.
బిత్తరపోతున్న టీడీపీ శ్రేణులు..
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మిన టీడీపీ శ్రేణులు.. ‘జాబ్ రావాలంటే బాబు రావాలి’ అని ఊరూవాడ ప్రచారం చేపట్టి హోరెత్తించాయి. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుండడంతో టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. 1995 నుంచి 2004 మధ్య తొమ్మిదేళ్లపాటూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 85 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి.. 25 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా వదలకపోవడాన్ని టీడీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా తయారైన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీరుపై ఆ పార్టీ శ్రేణులే మండిపడుతుండటం గమనార్హం.
జాబ్ పోవాలంటే బాబు ఉండాల్సిందే
జాబ్ కావాలంటే బాబు ఉండాల్సిందే అనే నినాదం, అధికారం రాగానే జాబ్ పోవాలంటే బాబు ఉండాల్సిందే అన్నట్లుగా మారి పోయింది. మొన్న ఆదర్శ రైతులు, క్షేత్ర సహాయకుల ఉద్యోగులపై వేటు వేసిన చంద్రబాబు చూపు అధ్యాపకులపై పడింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలకు భద్రత కరువైందని వాపోతున్నారు.
- అంజూరు శ్రీనివాసులు, శ్రీకాళహస్తి
మళ్లీ బాబు రాక్షస పాలన కనిపిస్తోంది
చంద్రబాబు తొమ్మిదేళ్ల రాక్షసపాలన మళ్లీ కనిపిస్తోంది. అనవసరంగా స్కిట్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఓ అధ్యాపకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరం. ఉద్యోగుల పట్ల అనాలోచితమైన నిర్ణయాలతో వారి జీవితాలు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇకనైనా చంద్రబాబు ఆలోచనా వైఖరి మారాలి.
- గుమ్మడి బాలకృష్ణయ్య, కౌన్సిలర్, శ్రీకాళహస్తి
ఉద్యోగాలు తొలగించడం సరికాదు
ఇంటికో ఉద్యోగం ఇచ్చి, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన చంద్రబాబు ఇలా ఉద్యోగాలు తొలగించడం సరికాదు. ఆదర్శరైతులు, క్షేత్రసహాయకులు, అధ్యాపకులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని కోరుతున్నాం.అంతేతప్ప కారణం లేకుండా ఉద్యోగాలను తొలగించడాన్ని ఖండిస్తున్నాం.
- లోకేష్‌బాబు, లోక సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు
బాబు ప్రవర్తనలో మార్పు ఇదేనా?
టీడీపీ నాయకులు తమ అధినేత ప్రవర్తనలో బాగా మార్పు వచ్చిం దని ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. ఆ మార్పు ఉద్యోగలను తొలగించడమేనా? దీని కన్నా ఆ తొమ్మిదేళ్ల పాలనే నయం గా ఉంది. ఆ తొమ్మిదేళ్లలో ఉద్యోగులను వేధించేవారనే ముద్రపడింది. అయితే ఈసారి ఉద్యోగులను తొలగించేవారుగా ముద్రవేసుకుంటున్నారు. ఇకనైనా బాబు సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలి.
- శంకర్‌రెడ్డి, రైతు
బాబు వస్తే ఉన్నవి పోతాయునుకోలేదు
జాబ్ రావాలంటే బాబు రావాలి.. అంటూ ఆర్భాటాలు చేశారు. బాబు వచ్చాడు గానీ ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు. ఉన్న జాబులనే ఊడగొడుతుంటే కొత్తవి ఎక్కడిస్తాడు. రాజశేఖరరెడ్డి నాలాంటి రైతులను ఎందరినో ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి గౌరవ వేతనం ఇచ్చి రైతుల పక్షపాతిగా నిలిస్తే బాబు వచ్చీ రాగానే వూపైన పడి నడి రోడ్డుపై నిలబెట్టాడు.
- నరసింహారెడ్డి, ఆదర్శరైతు, గంగవరం వుండలం
ఉద్యోగం పోతే మా కుటుంబం రోడ్డున పడాల్సిందే
నేను నాలుగేళ్లుగా హాస్టల్‌లో ఔట్‌సోర్సింగ్ కింద కామాటి(కుక్ అసిస్టెంట్)గా రూ.6700 జీతానికి పనిచేస్తున్నాను. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇబ్బందులతోనే పిల్లలను చదివించుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాను. కొత్త ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే జరిగితే మేం రోడ్డున పడాల్సిందే.
-తులసీరాం, కామాటి, ఎస్‌సీ హాస్టల్, బెరైడ్డిపల్లె.
వైఎస్ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఆదర్శ రైతుల బతుకులు బాగుపడుండేవి. ఆదర్శరైతులను ఆదుకోవాలని వైఎస్ అప్పట్లోనే ఓ నిర్ణయూనికొచ్చారు. అరుుతే మా పార్టీ అధికారంలోకొస్తానే ఇంటికో ఉద్యోగమిస్తావున్న చంద్రబాబు ఉద్యోగాల్లో ఉన్న వారిని తీసేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయుం. అసలు ఇలా జరుగుతుందని మేం ఊహించలేదు.
- సాంబశివారెడ్డి, ఆదర్శరైతు, నక్కపల్లె, పలవునేరు వుండలం