► ఉప ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టే ఎత్తుగడ
► టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన కౌన్సిలర్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు
► నిరసన వ్యక్తం చేసిన మునిసిపల్ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ నేతలు
నంద్యాల:
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఓటమి భయం వెంటాడుతుండడంతో అధికార పార్టీ నేతలు అడ్డదారులు వెతుకుతున్నారు. ఇప్పటికే పలుమార్లు పర్యటించిన ప్రభుత్వ పెద్దలు లెక్కకు మిక్కిలిగా హామీలు ఇవ్వగా తాజాగా వైఎస్సార్‌సీపీ కేడర్‌ను భయపెట్టేందుకు పోలీసులను రంగంలోకి దింపారు. సోమవారం అర్ధరాత్రి 18వ వార్డు కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన ఇంటితో పాటు బంధువులు, ఇరుగూ పొరుగు ఇళ్లలోనూ సోదాల పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు. టీడీపీ తరఫున గెలిచిన సుబ్బరాయుడు గత నెలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అంతేగాక, పట్టణంలోని విశ్వనగర్‌కు చెందిన టీడీపీ నేత ప్రతాప్‌గౌడ్, ఆయన అనుచరులను, పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులను పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమక్షంలో ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేర్పించారు.
ఇది అధికార పార్టీ నేతలకు మింగుడుపడలేదు. సుబ్బరాయుడును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులతో టార్గెట్ చేయించారు. ఆయన వద్ద ఆయుధాలు, డబ్బు ఉన్నాయని చెబుతూ డీఎస్పీ వేణుగోపాలకృష్ణ, టూటౌన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సుబ్బరాయుడు, ఆయన బంధువులు, ఇరుగుపొరుగు ఇళ్లల్లో సోదాలకు దిగారు. కౌన్సిలర్ ఇంట్లో ఉన్న రూ.8.10 లక్షల నగదు, పక్కనే ఉండే రజకులు మద్దిలేటి, బాలమద్దిలేటి ఇళ్లలో రూ.5.72 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో ఎందుకు చేరావు.., పంపిణీ చేయడానికే డబ్బు నిల్వ చేసుకున్నావంటూ ఆయనను బెదిరించారు.
రోడ్డెక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కౌన్సిలర్ సుబ్బరాయుడు విషయంలో పోలీసుల చర్యను నిరసిస్తూ మంగళవారం మునిసిపల్ చైర్‌పర్సన్ సులోచన, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్, జాకీర్, భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, శోభారాణి, చాంద్‌బీ, మాతంగి కన్నమ్మ, కరీంబాషా, పార్టీ నేతలు సిద్ధం శివరాం, కృష్ణమోహన్, తులసిరెడ్డి, గోపినాథరెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, ఉక్కుప్రసాద్, రామ సుబ్బయ్య తదితరులు నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఐ శ్రీనివాసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. అయితే.. తమ పార్టీ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలను వేధిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని చైర్‌పర్సన్ సులోచన హెచ్చరించారు. అలాగే నంద్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ రామసుందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
నంద్యాలలో పోలీసుల అత్యుత్సాహం
Published Wed, Jul 12 2017 6:49 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
Advertisement
Advertisement