సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ వేగులను రంగంలోకి దించింది. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మారిన సమీకరణలను అధ్యయనం చేసేందుకు చంద్రబాబు తనయుడు లోకేష్ తన దూతలను పురమాయించారు. ఈ క్రమంలోనే సోమవారం చేవెళ్లలో పార్టీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేఎస్ రత్నం సహా ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం పార్టీ పరిస్థితిని అంచనా వే యడంలో భాగంగానే ఈ పర్యటన సాగినట్లు తెలిసింది. గ్రామాల వారీగా పార్టీ పనితీరు, తెలంగాణ వాదం, ప్రభుత్వ వ్యతిరేకతను ఆరా తీసిన వేగులు.. పార్టీ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నాయకుల అంతరంగం తెలుసుకున్నారు. తెలంగాణ లో కాస్తో కూస్తో గెలుపుపై ఆశలు పెట్టుకున్న రంగారెడ్డి జిల్లాలో సానుకూల ఫలితాలు సాధించేందుకు వీలుగా ఇతర పార్టీల్లోని అసంతుష్టులను చేరదీసే అభిప్రాయ సేకరణ జరిపినట్లు సమాచారం. అధికారపార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మలుచుకోవాలని, అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వీలుగా సంప్రదింపులు జరపాలని సూచించినట్లు తెలిసింది.
గెలుపోటములను ప్రభావితం చేసే కుల, ఉపకులాలు, సామాజిక సమీకరణలపై కూడా ఈ సమావేశంలో లోతైన విశ్లేషణ సాగించారని తెలిసింది. నియోజకవర్గంలోని 245 పోలింగ్ బూత్‌లలో పార్టీ సానుభూతిపరులు సహా.. ఇతర కులాల, ఉప కులాల ఓటర్ల వివరాలను కూడా సేకరించాలని లోకేష్ అంతరంగికుడు ఆదేశించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం. ఇదిలావుండగా... తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో పార్టీకి మంచి మైలేజ్ వచ్చినప్పటికీ, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ద్వంద్వ ప్రకటనలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని కొందరు తమ్ముళ్లు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది.
జిల్లాపై ఆశలు..
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడుచుపెట్టుకుపోయింది. అయితే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వాదం బలీయంగా లేకపోవడం, శివార్లలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉండడంతో టీడీపీ ఇక్కడ నిలదొక్కుకోవాలని ఆశిస్తోంది. జిల్లాలో నెలకొన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల దృష్ట్యా పాగా వేయాలని భావిస్తోంది. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంటరీ స్థానానికి పోటీచే స్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా గెలుపునకు బాటలు వేసుకోవాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. అంతేగాకుండా చంద్రబాబు తనయుడు నారాలోకేష్ కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగుతారనే వార్తలు వెలువడుతున్నాయి.
తమ సామాజికవర్గం బలంగా ఉన్న శేరిలింగంపల్లిపై ఆయన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే తన అంతరంగికులతో జిల్లాలో పార్టీ పరిస్థితిపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా పార్టీ కేడర్‌లో కదలిక తెచ్చేందుకు త్వరలోనే లోకేష్ కూడా జిల్లా పర్యటన చేసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు చేవెళ్లను వేదిక చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా బాట పట్టిన అంతరంగికులు అన్ని నియోజవకర్గాల్లో పార్టీ తీరుపై శ్రేణుల మనోగతాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
లోకేష్ వేగులొచ్చారు!
Published Tue, Dec 24 2013 12:26 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM
Advertisement
Advertisement