'చేతకాని సీఎంగా మిగలనున్న చంద్రబాబు'
కావలి : అధికారం కోసం ఇష్టానుసారం ఉచిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక రాష్ట్ర చరిత్రలో చేతకాని సీఎంగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో మిగలనున్నారని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు వీజీఆర్ నారగోని అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన రైతు రుణమాఫీ అసాధ్యమని వ్యాఖ్యానించారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని బాబు హామీ ఇస్తే బాగుండేదన్నారు.
అమలుకు సాధ్యమయ్యే హామీలు ఇవ్వాలే తప్ప అధికారం కోసం ఇలా హామీలు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు ఉచిత వాగ్దానాలు ఇవ్వడం పనికి మాలిన చర్యగా నారగోని అభివర్ణించారు. బీసీల రిజర్వేషన్ను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అనంతపురం, శ్రీకాకుళానికి అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.