
వైభవంగా నృసింహుని పెళ్లి కుమారుడి ఉత్సవం
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్
మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి పెళ్లి కుమారుడి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అఖిలలోక పవిత్ర గోత్రజుడైన స్వామి అందరికీ పవిత్రత కలుగజేసేందుకు పెళ్లికుమారుడిగా దర్శనమిచ్చారు. మంగళాద్రి నారసింహుని బ్రహ్మోత్సవాలు పెళ్లి కుమారుని ఉత్సవంతో ప్రారంభం కావడం ఆనవాయితీ. ఉదయాన్నే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానం చేయించి అర్చక స్వాములు స్వామి వార్లను పెళ్లి కుమారునిగా, అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించారు. పెళ్లికుమారుడైన స్వామివారిని కనులారా తిలకిం చేందుకు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకున్నారు.
స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి పెళ్లి కుమారుని గ్రామోత్సవం ఘనంగా జరిగిం ది. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆయా కూడళ్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని టెంకాయ లు కొట్టి, హారతులిచ్చారు. నృసిం హుని పెళ్లి కుమారుని ఉత్సవాన్ని తిలకిస్తే నిత్యశుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం ప్రతి నిధులు కైంకర్యపరులుగా వ్యవహరించగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. తాడేపల్లికి చెందిన శ్రీరామ యజ భజన మండలి ఆధ్వర్యంలో కోలాటం, శ్రీ అభయాంజనేయస్వామి భజన సమాజం, మంగళగిరి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం, పట్టణానికి చెందిన పి.దుర్గాభవాని అన్నమాచార్య సంకీర్తనలు, సాయిసుధ భక్తి సుధ భక్తి రంజని కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
నేడు ధ్వజారోహణం...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి తొమ్మిది గంటలకు స్వామి వారి ధ్వజారోహణ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు.