
విప్పర్ల చెరువును ఆధునీకరించండి..
► అప్పుడే నరసరావుపేట తాగు నీటి సమస్య పరిష్కారం
► స్టోరేజ్ ట్యాంక్‌లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి
నరసరావుపేట వెస్ట్ : నరసరావుపేట పట్టణ ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి అవస్థలు తీరాలంటే రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో ఉన్న 200 ఎకరాల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. పట్టణ ప్రజల తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు. పట్టణానికి తాగునీటిని అందించే రావిపాడు శాంతినగర్ రిజర్వాయర్, నకరికల్లులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆదివారం ఆయన ప్రజారోగ్య శాఖ ఈఈ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విప్పర్ల చెరువుకు సాగర్ మైనర్ కాలువ ద్వారా సరాసరి నీరు తరలుతున్నందున కొద్ది సమయంలోనె చెరువు నిండుతుందన్నారు.
కేవలం రూ.30 లక్షల వ్యయంతో ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చవచ్చని చెప్పారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో పాటు విప్పర్ల చెరువు నీరు కూడా ఉంటే తాగునీటి అవస్థలకు పుల్‌స్టాప్ పెట్టవచ్చన్నారు. పది రోజులుగా సాగర్ కాలువల ద్వారా వస్తున్న నీరు ప్రస్తుతం నకరికల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 15 శాతం మాత్రమే చేరిందని చెప్పారు. రోజు విడిచి రోజు ఇస్తే రెండు లేదా మూడు నెలలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వర్షాలు పడితే కాలువలకు నీరు వదిలే అవకాశం ఉంటుందని ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ తెలిపారన్నారు.
అధికారుల విఫలం..
రిజర్వాయర్లను నింపటంలో కూడా అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేక విఫలమయ్యారని ఆయన తెలిపారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చుచేసి 20 మోటార్లను వినియోగించి రిజర్వాయర్లు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు కార్పొరేషన్ మాదిరిగానే రూ.15 లక్షలతో 500 హార్స్ పవర్ ఇంజిన్‌ను కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే తక్కువ సమయంలోనే ట్యాంకును 50 శాతం వరకు నింపవచ్చన్నారు. అలాగే, కాలువ తూములను 2 నుంచి నాలుగైదు మీటర్లకు పెంచాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, జిల్లా కార్యదర్శులు షేక్ ఖాదర్‌బాషా, కందుల ఎజ్రా, కౌన్సిలర్లు ఉన్నారు.