రెండూ రాష్ట్రాలకూ నరసింహనే గవర్నర్!
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నేపధ్యంలో జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలకు ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌నే కొనసాగించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి అంగీకారం తర్వాత ఆ ఫైల్ రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లింది. ఇక రాష్ట్రపతి అంగీకారం లభిస్తే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లకు నరసింహనే ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతారు.
కాగా రెండు రాష్ట్రాలకూ కొంతకాలం ఒకే వ్యక్తి ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతారు. అయితే ఎంతకాలం అన్నది రాష్టప్రతి నిర్ణయిస్తారు. ఇదే సమయంలో ఉమ్మడి రాజధానిలో నివశించే వారి భద్రత బాధ్యతలు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా ఉండే గవర్నర్‌కే అప్పగించనున్నారు. అలాగే శాంతిభద్రతలు, అంతర్గత నిఘా, ప్రభుత్వ భవనాలను ఇరు ప్రాంతాల అవసరాలకు అందుబాటులో ఉండేలా చూడటం, నగరంలోని ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలనూ గవర్నర్ చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి తన వ్యక్తిగత నిర్ణయాలను ఆమలు చేయాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. దీనికోసం ఆయనకు ఇద్దరు సహాయకులను కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.