తెలంగాణ తొలి గవర్నర్గా నరసింహన్ ప్రమాణం
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నరసింహన్ చేత చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కిషన్ రెడ్డి, నారాయణ, నాదెండ్ల మనోహర్, చక్రపాణి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీ తదితరులు హాజరైయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగు మాట్లాడే వారు ఇక అధికారికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా వేరయ్యారు. కాగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కొత్త రాష్ట్రాలకు తొలి గవర్నర్గా వ్యవహరించనుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కొనసాగడంతో పాటు తెలంగాణ గవర్నర్గా కూడా నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.