
‘ముద్రగడ పాదయాత్రకు మా మద్దతు’
కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు మేం మద్దతు ఇస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
పశ్చిమగోదావరి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు మేం మద్దతు ఇస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయమని ముద్రగడ అడుగుతుంటే ప్రభుత్వానికి భయమేందుకని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఇసుక, ల్యాండ్ మాఫియా గ్యాంగ్లను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతున్నాయన్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు బయలుదేరితే పోలీసులు అడ్డుకున్నారు. నేటితో ముద్రగడ గృహ నిర్భంధం ముగిసిపోయింది. మరోసారి పాదయాత్రకు రెడీ అయినా ముద్రగడను ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇది నిరవధిక పాదయాత్ర... వాయిదా వేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.