
'నరేంద్రగారు మాకు పాఠాలు చెప్పొద్దు'
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షం అడ్డుపడుతోందని ప్రభుత్వ విప్ ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఉపనేత జ్యోతుల నెహ్రు అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేంద్రగారు మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని, సభలో ప్రతిపక్షం అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్లే సభ నుంచి తాము మంగళవారం వాకౌట్ చేశామన్నారు. అధికారపక్షం ఏకపక్ష ధోరణితో వెళుతోందని, రెండు చేతులు కలిస్తేనే చప్పళ్లు వస్తాయని, సమస్యలు లేవనెత్తితే తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జ్యోతుల నెహ్రు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభ వ్యవహారాలను చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.
కాగా అంతకు ముందు ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ సభలో ప్రతిపక్షతీరు సరిగ్గా లేకనే సభ జరగడంలేదని అన్నారు. వివరణపై సమాధానం చెప్పకముందే ప్రతిపక్షం సభనుంచి వాకౌట్ చేసిందన్నారు.