స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చను స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండోసారి వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే రాజధానిపై చర్చకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేయగా అందుకు స్పీకర్ నిరాకరించారు. కాగా అంతకు ముందు రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణ అంశంపై శాసనసభ దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో సభ రెండు సార్లు వాయిదాపడింది.
బుధవారం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో రైతులను భయభ్రాంతులకు గురిచేశారని, వారిపై విపరీతమైన ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా భూసమీకరణ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. తక్షణమే ఈ కీలక అంశంపై చర్చించాలని పట్టుబట్టింది. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో... వైఎస్ఆర్ సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టడంతో సభ తొలిసారి వాయిదా పడింది.
తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్ సీపీ సభ్యులు చర్చకోసం పట్టుబట్టారు. గతంలో రాజధాని అంశంపై చర్చ జరిగిందని, ఇప్పుడు కూడా చర్చించడానికి సిద్ధమేనని ప్రభుత్వం తరఫున మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అయితే ఎప్పుడు చర్చించేదన్న సమయాన్ని కచ్చితంగా చెప్పాలని, ఆ మేరకు సభాకార్యక్రమాల్లో సమయం నిర్ధారించాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది.
రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం చెప్పేదానికీ, వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, వీటిని సభ దృష్టికి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యంత కీలక అంశం అయినందున దీనిపై చర్చించాలని గట్టిగా పట్టుబడుతూ మరోసారి సభను అడ్డుకుంది. దీంతో సభ రెండోసారి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారంటూ 9మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత నోటీస్ ఇచ్చారు. దీనిపై మరోసారి సభలో గందరగోళం నెలకొంది.