విజయనగరం వ్యవసాయం: జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండి పోతున్నాయి. మూడు రోజులుగా ఎండ ప్రచండంగాఉండడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. శుక్రవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండలకు తోడు వేడిగాలులు వీయడంతో జిల్లా వాసులు శలభాల్లా మాడిపోయారు. చాలా మంది ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూవాతావరణం
నెలకొంది. ఇంతఎండతీవ్రత గతపదేళ్లలో ఎప్పుడూ లేదని శాస్త్రవేత్త పాత్రో తెలిపారు. వడదెబ్బకు బుధవారం ఐదుగురు, గురువారం ముగ్గురు మరణించగా, శుక్రవారం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక, బయటకు వస్తే ఎండవేడిమి భరించలేక జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది.
వేడిగాలులు కూడా వీస్తుండడంతో ఆందోళనకు గురౌతున్న జిల్లావాసులు ప్రయాణాలను, బయట పనులను వాయిదా వేసుకుంటున్నారు. పగటిపూట ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. దుకాణాలను కూడా మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి, మళ్లీ సాయంత్రం తెరుస్తున్నారు. శుక్రవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కొత్తవలస, కురుపాం, చీపురుపల్లి, నెల్లిమర్ల తదితర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి భరించలేక రోగులు అవస్థలకు గురవుతున్నారు. కేంద్రాస్పత్రిలోని ఎమర్జీన్సీ వార్డు, బర్నింగ్ వార్డుల్లో ఉన్న రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వార్డుల్లో ఏసీలు ఉన్నప్పటికీ ఉపశమనం ఇవ్వకపోవడంతో రోగి బంధువులు విసనకర్రలు ద్వారా విసురుతూ రోగులకు ఉపశమనం కలిగిస్తున్నారు.
ఫ్రై డే
Published Sat, May 23 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement