ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న నవదీప్‌సింగ్ గ్రేవల్
సాక్షి, ఏలూరు టౌన్ (పశ్చిమ గోదావరి): ప్రజలకు మెరుగైన ఉత్తమ సేవలు అందించేందుకు 24గంటలూ అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా బాధితులు తన వద్దకు రావచ్చని, తలుపులు తెరిచే ఉంటాయని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట వేస్తామని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా పటిష్ట చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక తన ప్రాధాన్య అంశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీల్లో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. జిల్లాలోని ఆయా సమస్యలపై సబ్ డివిజినల్ అధికారులతో సమీక్షించి, ముందుగా ఒక అవగాహన తెచ్చుకోవాలని, అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులతో స్నేహపూర్వకంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు.
మంచి వాతావరణంలో పోలీసులు, ప్రజలకు మధ్య సంబంధాలు ఉండేలా చూస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై ఎప్పుడైనా తనవద్దకు రావచ్చని, 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రతి సోమవారం ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని, సబ్ డివిజన్ పరిధిలోనూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నవదీప్‌సింగ్ చెప్పారు. జిల్లాలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి అవాంతరాలు కల్పిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.
అధికారుల శుభాకాంక్షలు
ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌ను జిల్లాలోని డీఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌బీ డీఎస్పీ నున్న మురళీకృష్ణ, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ పీ.భాస్కరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం డీఎస్పీ రవికుమార్, నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు జిల్లా ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
క్రైం రేట్ పెరిగితే సహించను: ఎస్పీ
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని, విధుల్లో జవాబుదారీతనం ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, క్రైం రేట్ పెరిగితే సహించేదిలేదని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ అధికారులను హెచ్చరించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన జిల్లాలోని సబ్ డివిజనల్ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా జిల్లాకు రావటంతో ఇక్కడ పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవటంతోపాటు, నేరాలపైనా ఆరా తీశారు. పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల విషయంలోనూ అత్యంత కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే అటువంటివారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈ నేరసమీక్షలో జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ నున్న మురళీకృష్ణ, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ పైడేశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సుబ్రహ్మణ్యం, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ, కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం డీఎస్పీ రవికుమార్, నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment