
బీల బూడిదే!
ఇచ్ఛాపురం:మరో బొగ్గుల కుంపటి రాజుకుంది. అసంతృప్తి సెగలు రేపుతోంది. ఉద్యమ జ్వాల రగిలిస్తోంది. ఇప్పటికే ఉద్యమాలు, కాల్పులు, మరణాలతో పచ్చని బీల ప్రాంతంపై గత పాలకులు నెత్తుటి మరకలు అద్దారు. వాటిని తుడిచేస్తామని, గత ప్రభుత్వం ఎన్‌సీసీ విద్యుత్ ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మరో విద్యుత్ కుంపటిని బీల ప్రజల గుండెలపై పెట్టేందుకు ప్రయత్నిస్తుండటం ఇక్కడి ప్రజల గుండెలను రగిలిస్తోంది. ఎన్‌సీసీ ప్లాంట్‌కు సంబంధించిన 1107 జీవోను రద్దు చేస్తూ నేడో రేపో ఉత్తర్వులు జారీ అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు, ఉద్యమకారులకు ప్రభుత్వ తాజా ప్రయత్నాలు అశనిపాతంగా మారాయి. పిడుగుపాటుకు గురి చేశాయి. సోంపేట, కవిటి మండలాలే కాకుండా మొత్తం ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలంతా ఐక్య పోరాటాలకు సంసిద్ధమవుతున్నారు. పర్యవరణ, మత్స్యకార ఐక్య వేదిక నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఉద్యమ వేడి రగిలిస్తున్నారు. మరోవైపు భూముల స్వాధీనానికి బీల గ్రామాల సర్పంచులు ససేమిరా అంటున్నారు.
70 కి.మీ. పరిధిలో బూడిదే
కొత్త ప్లాంట్ ఏర్పాటుకు తెరవెనుక ఇప్పటికే జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. సుమారు 26 గ్రామాల్లో భూసేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. దీనివల్ల సుమారు 40వేల మంది ఊళ్లొదిలిపోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు ఆరేడువేల మంది ఉపాధి కోల్పోతారని, విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద కారణంగా చుట్టుపక్కల సుమారు 70 కిలోమీటర్ల పరిధిలో పంటపొలాలు నాశనమయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గతంలో 2500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికే భారీ వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఇప్పుడు బారువ ప్రాంతంలో ఏకంగా 4వేల మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటుకు జపాన్‌లోని సుమిటొమొ సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అనుకూల సర్పంచ్‌లతో తీర్మానాలకు ప్రణాళిక
కాగా థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు అనుకూలంగా పంచాయతీల్లో తీర్మానాలు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి చెందిన పలువురు సర్పంచ్‌ల ద్వారా పంచాయతీ తీర్మానాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే పలువురు సర్పంచులు తీర్మానాలకు అంగీకరించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. కాగా ఎన్‌సీసీ ప్లాంట్ రద్దుకు ఇప్పటికే పోరాడుతున్న పలు సంఘాలు.. ఇప్పుడు కొత్త ప్లాంట్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
సమష్టిగా పోరాటం చేస్తాం
బారువ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పూనుకుంటే దాన్ని ఆపడానికి మండల ప్రజలంతా సమష్టిగా పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకునేది లేదు. -పాతిన శేషగిరి, సోంపేట మండల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు
కాంగ్రెస్ గతే పడుతుంది
ఎన్‌సీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిన గతే, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి పడుతుంది. ప్రాణాలకు తెగించి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిపాదనను విరమించుకోవాలి. - యర్ర తారకేశ్వరరావు, బారువ సర్పంచ్
మత్స్యకారుల జీవనాధారం పోతుంది
బారువ ప్రాంతంలో విద్యుత్ కేంద్రం నిర్మిస్తే మత్స్యకారులకు జీవనాధారం పోతుంది. అందువ్ల మత్స్యకారులు, రైతులు ఐక్యంగా పోరాటం చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకోవడం ఖాయం.
- సూరాడ చంద్రమ్మ, ఉప్పలాం సర్పంచ్
థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సహించం
ఈ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సహించేది లేదు. గతం నుంచి దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తాజా ఉత్తర్వులు ఈ ప్రాంతవాసుల్ని మరింత కుంగదీస్తున్నాయి. దీనిపై ఉద్యమిస్తాం. -యారడి ఆనందరావు, గోకర్ణపురం సర్పంచ్, కంచిలి మండలం