
ప్రకాశం జిల్లా / మద్దిపాడు: ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. సుమో నుజ్జునుజ్జయినా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి దెబ్బలు తగలకుండా బయట పడడం విశేషం. ఈ ఘటన బుధవారం ఉదయం 6 గంటల సమయంలో వెల్లంపల్లి బ్రిడ్జిపై చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..ఎ¯టీఎస్ లాజస్టిక్ వాహనం భారీ లోడుతో ఒంగోలు వైపు నుంచి విజయవాడ వైపు బయలుదేరింది. వాహనానికి ఎస్కార్ట్‌గా ఆ కంపెనీ మేనేజర్ రమేష్, డ్రైవర్ జగన్ సుమోలో వెళుతుండగా ఆదే దారిలో కృష్ణపట్నం పోర్టు నుంచి కొత్తగూడెం వెళుతున్న లారీ డ్రైవర్ అతి వేగంగా ఢీ కొట్టడంతో సుమో నుజ్జునుజ్జయింది.
స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో సుమోలో ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి హైవే పెట్రొలింగ్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వారు ఎన్‌హెచ్ పెట్రోలింగ్ సిబ్బంది, మద్దిపాడు పోలీసులతో ఘటనా స్థలికి చేరుకుని సుమోలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి స్థానికులతో కలసి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒంగోలు నుంచి అగ్నిమాపక శకటం కూడా ఘటనా స్థలికి వచ్చింది. చివరకు లాజస్టిక్ పుల్లర్‌తో వారిని బయటకు తీసి 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోని తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.