నీరు-చెట్టు అక్రమాలపై కదిలిన లోకాయుక్త
తలమంచిలో పనులను తనిఖీ చేసిన డీడీ
తలమంచి(కొడవలూరు): మండలంలోని తలమంచిలో నీరు-చెట్టు పనుల్లో జరిగిన అక్రమాలపై లోకాయుక్త విచారణ మొదలుపెట్టింది. గ్రామంలో గతేడాది నీరు-చెట్టు పథకం కింద జరిగిన పనులను లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ వి.గంగరాజు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ పరిధిలో గతేడాది నీరుచెట్టు పథకం కింద 12 చోట్ల కాలువల పూడిక తీత పనులకు రూ.12.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులన్నింటినీ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు జొన్నా శివకుమార్ చేపట్టారని, అయితే పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారని గ్రామానికే చెందిన పిట్టి సూర్యనారాయణ అనే రైతు మూడ్నెల్ల క్రితం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ విభాగం డిప్యూటీ డెరైక్టర్ గ్రామానికి వచ్చారు. అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న 12 పనులను పరిశీలించారు.
ఫిర్యాదుదారైన సూర్యనారాయణను పిలిచి విచారించారు. ఫిర్యాదుదారు కాలువ పనుల్లో జరిగిన అక్రమాలను డీడీకి వివరించారు. అసలు కాలువల్లో పూడిక తీయకుండానే బిల్లులు స్వాహా చేశారని చెప్పారు. మొదటి పంట సమయంలో పూడిక తీయక సాగు నీరందని పరిస్థితి నెలకొనగా, రైతులే స్వచ్ఛందంగా కాలువలు పూడిక తీసుకొన్నారని తెలిపారు. నీరుచెట్టు కింద పనులు చేసినట్టు చూపిన కాలువలనే మళ్లీ ఎఫ్‌డీఆర్(ఫ్లడ్ డామేజ్ రిపేర్స్)కింద చేపట్టారని చెప్పారు. ఈ పనులు కూడా అత్యంత అధ్వానంగా జరిగాయని వివరించారు. అనంతరం డీడీ మాట్లాడుతూ గ్రామంలో నీరు-చెట్టు పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు ఫిర్యాదు అందినందున విచారణకు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు వాస్తవమా కాదా అని తనిఖీ చేశామన్నారు. తదుపరి విచారణలో ఇరిగేషన్ అధికారుల నుంచి ఆ పనులకు సంబంధించిన ఎస్టిమేషన్, మంజూరు, ఎంబుక్, బిల్లుల చెల్లింపుల వివరాలను ఇరిగేషన్ అధికారుల నుంచి తెప్పిస్తామన్నారు.