చెన్నూరు : జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న ఒత్తిళ్లు.. అధికారుల నిర్లక్ష్యం దళిత నిరుద్యోగులకు శాపంలా మారింది. ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక చిన్నపాటి యూనిట్లు నెలకొల్పుకొని జీవిద్దామనుకొంటున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ, బ్యాంకు మేనేజర్లను సమన్వయం చేయాల్సిన అధికారులు విఫలంమయ్యారు. అధికారులు ఇటు నేతలకు, అటు బ్యాంకు అధికారులకు ఎంత చెప్పినా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో నిరుద్యోగులైన దళిత యువకులకు మంజూరైన రుణాలు రద్దయ్యాయి.
రూ 9.10 లక్షల సబ్సిడీ రద్దు
చెన్నూరు మండలంలోని నిరుద్యోగులైన ఎస్సీ యువకులకు యూనిట్లు నెలకొల్పేందుకోసం ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 36 సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. ఇందులో చెన్నూరు ఎస్‌బీఐ 11, ఏపీజీబీ రామనపల్లెకు 10, చెన్నూరు ఏపీజీబి 15 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు గత ఏడాది నవంబర్‌లో దరఖాస్తులు చేసుకోవాలంటూ అధికారులు చెప్పారు. 253 మంది దరఖాస్తులు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నాయకులు, అధికారులు, బ్యాంకర్ల చుట్టూ తిరిగి తమకు సబ్సిడీ రుణాలు ఇప్పించాలని కోరారు.
రూ. 50 వేల నుంచి రూ. లక్షవరకు సబ్సిడీ యూనిట్లు కావడంతో అధికార పార్టీ నాయకులు వారికి అనుకూలమైన వారికి ఇప్పించేందుకు ఒత్తిడి చేశారు. స్టేట్‌బ్యాంకు, ఏపీజీబీ రామనపల్లె బ్యాంకుల్లో జాబితా పూర్తి చేసి వెంటనే పంపారు. యూనిట్లు మంజూరయ్యాయి. చెన్నూరు ఏపీజీబీలో బ్యాంకు మేనేజర్ లబ్ధిదారుల జాబితా తయారు చేసి పంపగా నాయకులు తమకు అనుకూలమైన వారివి తక్కువ ఉన్నాయని జాబితా వెనక్కు పంపారు. మేనేజర్ నేరుగా ఎస్సీ కార్పొరేషన్‌కు పంపారు. జన్మభూమి సంతకాల కోసం మండలానికి పంపారు. వారు అక్కడి నుంచి పంపక పోవడంతో గడువు దాటిపోయింది. దీంతో సుమారు 30 మందికి మంజూరు కావాల్సిన రుణాలు ఆగిపోయాయి. రూ. 9.10 లక్షల సబ్సిడీ రద్దయింది.
ఆవేదనలో లబ్ధిదారులు
తాము దరఖాస్తు చేసుకొని రుణాలకు అర్హత పొందినా అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయామని నిరుద్యోగులైన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీనేతలు తాము చెప్పిన వారికే ఇవ్వాలని ఒత్తిడి చేయడం.. బ్యాంకులో లావాదేవీలు జరిపే వారికి తాము ఇవ్వాలంటూ బ్యాంకర్లు పట్టుబట్టడంతో ఎవ్వరికి రుణాలు రాకుండా పోయి సబ్సిడీని కోల్పోవాల్సి వచ్చిందని లబ్ధిదారులు అంటున్నారు.
ఈ విషయంపై ఎంపీడీఓ విజయకుమారిని వివరణ కోరగా జాబితాను సిద్ధం చేశామని ఎస్సీ కార్పొరేషన్ సిబ్బందికి తీసుకెళ్లాలని సూచించినా రాలేదని, ఈ జాబితాలో రుణాలు రానివారికి మళ్లీ జాబితాలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. బ్యాంకు మేనేజర్ లక్ష్మికాంత్‌రెడ్డి మాత్రం తాము బ్యాంకు నిబంధనల ప్రకారం లావాదేవీలు, రికవరీలు చేసుకొని రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
అధికారుల నిర్లక్ష్యం... నిరుద్యోగులకు శాపం
Published Thu, Jul 9 2015 3:31 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement