
సుందరనగరంగా నెల్లూరు
నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌గా అజీజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు(అర్బన్): నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌గా అజీజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత నగరంలోని గాంధీ, అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు అజీజ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ పూలదండలు వేశారు. ర్యాలీగా నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. మేయర్‌కు నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అధికారులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు వెంటరాగా మేయర్ అజీజ్ తన చాంబరులోకి అడుగుపెట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మేయర్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ, వెంకయ్యనాయుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగా ఉండటం అదృష్టమన్నారు.
పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లి నెల్లూరును అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రధానంగా మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తాగునీరు, డ్రెయినేజి సౌకర్యం కల్పించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. అదేవిధంగా నగర పాలక సంస్థ పాఠశాలలు, కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులపై కూడా దృష్టి కేంద్రీకరించున్నట్లు తెలిపారు. అనేక ఆసుపత్రులు శిథిలావస్థకు చేరినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నగర పాలక సంస్థ సిబ్బందికి, ప్రజలకు మధ్య స్నేహభావం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్యాక్రాంతమైన కార్పొరేషన్ ఆస్తులు పరిరక్షించుకునేందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబరును పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. నగర పాలక సంస్థలో అవినీతిని నిర్మూలించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అధికారులెవరైనా అవి నీతికి పాల్పడి ఉంటే చట్ట పరిధిలో చర్యలుంటాయని చెప్పారు. గతంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి తప్పులు జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తమ హయాంలో ఎవరిపై ఒత్తిళ్లు ఉండవని, ఉద్యోగులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించుకోవచ్చన్నారు. గతంలో జరిగిన అక్రమాలు బయటపడితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.
అన్ని డివిజన్లలో
ఉద్యోగుల ఫోన్ నంబర్లు
నగరంలోని అన్ని డివిజన్లలో ఆ ప్రాంతానికి సంబంధించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్, వాటర్‌వర్క్స్ అధికారి, వీధి దీపాలకు సంబంధించిన సిబ్బంది లేదా అధికారి ఫొటో, ఫోన్ నంబరు ప్రదర్శిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడుతుందో ఆ ప్రాంత అధికారికి త్వరగా సమాచారం అంది, సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. వారికి చెప్పినా సమస్యకు పరిష్కారం లభించకపోతే కమిషనర్ లేదా తనకు ఫోన్ చేయాలని తెలిపారు. అదేవిధంగా కమిషనర్, మేయర్ ఈ-మెయిళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని, తమకు మెయిల్ ద్వారా కూడా సమస్య తెలుపవచ్చన్నారు. నగరాభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు.
ఎన్నికల వరకే పార్టీల జెండాలు
ఎన్నికల వరకే పార్టీల జెండాలుంటాయని అనంతరం అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఉంటుందని మేయర్ అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయని, ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉందని, అభివృద్ధి ఎలా చేస్తారనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ తనకు విద్య నేర్పిన గురువని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తన కుటుంబానికి సన్నిహితుడని, నెల్లూరు నగర అభివృద్ధికి వారితో మాట్లాడి నిధులు సాధిస్తానని అజీజ్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నామని తెలిపారు.
సర్వమత ప్రార్థనలు
అబ్దుల్‌అజీజ్ కార్పొరేషన్ కార్యాలయంలోకి రావడంతోనే సర్వమత ప్రార్థనలు చేశారు. పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. నూతన మేయర్ అజీజ్‌కు పలువురు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మాజీ మేయర్ పులిమి శైలజ, పలువురు వైఎస్సార్‌కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి అభినందించారు.