నేతల పరార్
‘రండి బాబూ రండి.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. ఎలాగోలా జనాన్ని తరలించి రాజమండ్రి సభను జయప్రదం చేయండి..’ అని ఆఫర్ ఇచ్చి ప్రాధేయపడినా జిల్లా నేతల నుంచి ఆశించిన స్పందన రాలేదు.. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
పెడుతున్న కొత్త పార్టీ ఏర్పాటు సభకోసం పడుతున్న తిప్పలు. చివరి బంతి ఇంకా మిగిలేఉందని సీమాంధ్రులను మభ్యపెట్టి.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు పదవిని పట్టుకుని వేలాడి.. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. ఎన్నికలు సమీపించే తరుణంలో తీరుబడిగా రాజీనామా చేసి పార్టీ పెట్టబోతున్న కిరణ్ తీరుపై ప్రజల్లోనే కాదు.. నేతల నుంచి కూడాతీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కొత్త పార్టీ ఏర్పాటుకు బుధవారం ముహూర్తం పెట్టిన కిరణ్‌ను జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోవడం లేదు. రాజమండ్రిలో జరుపతలపెట్టిన సభను గట్టెక్కించి పరువు దక్కించమని పలువురికి కిరణ్ నేరుగా ఫోన్ చేసి బతిమాలినా సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. కాంగ్రెస్‌ను వీడి దూరంగా ఉన్న సీనియర్ నాయకులు సైతం అవసరమైతే మరో పార్టీలో చేరతాం తప్ప.. కిరణ్ పార్టీలోకి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి రాజమండ్రి సభకు తరలివెళుతున్నవారి సంఖ్య వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు.
పెద్దదిక్కు లగడపాటి?
ఆదినుంచి రాష్ట్ర విభజన జరగదని, అడ్డుకుంటామని బీరాలు పలికిన లగడపాటి రాజగోపాల్ చివరికి తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. తర్వాత కిరణ్ పార్టీ పెడితే కొనసాగుతానంటూ మెలిక పెట్టారు. రాజకీయాల్లో తాను కొనసాగాలని సభలు పెట్టి ఒత్తిడి చేయాలంటూ లగడపాటి పలు నియోజకవర్గాల నేతలను ప్రాధేయపడినా ఫలితం దక్కలేదు. చివరికి కిరణ్ ప్రకటించిన కొత్త పార్టీలో వ్యూహకర్త అవతారం ఎత్తారు.
ఆయనతోపాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నగర మాజీ మేయర్ రత్నబిందు కిరణ్ పార్టీలో చేరడంతో ఆమెకు ఉపాధ్యక్షురాలి పదవిని కట్టబెట్టారు. నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాసిరెడ్డి అనురాధలు రాజమండ్రి సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, లగడపాటి నేతృత్వాన కార్పొరేషన్ ఎన్నికల్లో ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ ప్యానల్‌ను పోటీకి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్‌కు చలమయ్య రాజీనామా..
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) మాజీ డెరైక్టర్ బొర్రా చలమయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం పలువురు సెల్ మెసేజ్‌లు ఇచ్చారు. కైకలూరు కాంగ్రెస్ టికెట్‌ను ఆశించిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి కిరణ్ కొత్త పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆయన రాత్రి తన అనుచరులతో సమావేశం నిర్వహించి రాజమండ్రి బాట పట్టనున్నారు. కేడీసీసీబీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో కిరణ్‌ను కలిశారు. ఆయన కూడా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీలోకి వెళుతున్నట్టు సమాచారం.
గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న పిన్నమనేని పార్టీ ఫిరాయించడంతో ఆయన స్థానంలో శిష్ట్లా దత్తాత్రేయులును ఇన్‌చార్జిగా నియమిస్తూ డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న పిన్నమనేని వైస్‌చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించకపోవడంతో బొర్రా చలమయ్య అలిగి అప్పట్లో డెరైక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు వారిద్దరు సమైక్యంగా కొత్త పార్టీలోకి వెళ్లడం ఇబ్బందికరమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బుద్ధప్రసాద్‌కు బాబు పిలుపు..
కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర విభజనతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి విదితమే. ఆయన కిరణ్ పార్టీవైపు వెళ్లకుండా టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంగళవారం చంద్రబాబు నుంచి పిలుపు వెళ్లినట్టు సమాచారం. బుద్ధప్రసాద్ కొడుకు కోడూరు మండలంలో పర్యటించి కాంగ్రెస్ నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరబోతున్న తన తండ్రికి సహకరించాలని కోరడంతో పలువురు తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, బూరగడ్డ వేదవ్యాస్, యలమంచిలి రవి, వెలంపల్లి శ్రీనివాస్‌లు కాంగ్రెస్‌ను వీడడం ఖాయమని తేలిపోయింది. వారు ఏ పార్టీ తీర్థం పుచ్చుకునేది ఇంకా తేలాల్సి ఉంది.