కొత్త పార్టీ కోసం సీఎం కలెక్షన్లు: అంబటి
హైదరాబాద్: సీఎం కిరణ్, లగడపాటి రాజగోపాల్వి నకిలీ సమైక్య ఉద్యమాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సమైక్యవాదం పేరుతో కొత్తపార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్‌లో కలపాలన్నదే సీఎం వ్యూహమని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమని అన్నారు. కొత్త పార్టీ పెట్టుబడి కోసం సీఎం హోదాలో కిరణ్ వందల కొద్ది ఫైల్స్‌పై సంతకాలు పెడుతున్నారని, కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
లగడపాటికి ఒక న్యాయం..సామాన్యుడొక న్యాయమా అని అంబటి ప్రశ్నించారు. ల్యాంకో గ్రూపు రూ.40 వేల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ల్యాంకోకు నెలకు రూ.570 కోట్ల నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ల్యాంకో ఇన్‌ఫ్రాకు రూ.8 వేల కోట్ల రుణాలను బ్యాంకులు రీషెడ్యూలు చేశాయని, తిరిగి రూ.3,500 కోట్ల రుణాలు కొత్తగా ఇచ్చాయని వెల్లడించారు. ఇవన్ని కొత్తపార్టీకి పెట్టుబడులా అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు నిజమైన దత్తపుత్రుడు లగడపాటి కాబట్టే కేంద్రం ఆయనకు ఉదారంగా రుణాలు ఇప్పిస్తోందన్నారు. కిరణ్, లగడపాటి కొత్త పార్టీ పెడితే ఓట్లు రావు, సీట్లు రావన్నారు. సీఎం పదవిని కిరణ్ వదిలేస్తే ఆయన్ను గుర్తుపట్టేవారుండరని అంబటి ఎద్దేవా చేశారు.