దీక్షపై దిగులు
► నవనిర్మాణ దీక్షకు జనసమీకరణపై కసరత్తు
► తహసీల్దార్లు, ఎంపీడీవోలకు టార్గెట్లు
► ఖర్చుపై ఆందోళన చెందుతున్న అధికారులు
విజయవాడ: వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వం తలపెట్టిన నవనిర్మాణ దీక్ష విజయవంతం చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఒత్తిళ్లు పెరిగాయి. నాలుగు రోజులుగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనసమీకరణకయ్యే ఖర్చులపై అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద చేపట్టిన దీక్షకు భారీగా జన సమీకరణ చేయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు నానా తంటాలు పడుతున్నారు. దాదాపు 30, 40 వేల మందికిపైగా జనాన్ని దీక్షలకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు సమాచారం. మండలానికి ఆరు వందల మంది చొప్పున తరలించాలని లక్ష్యం విధించారు.
ఇప్పటికే జిల్లాలో 49 మండలాల్లో ఎంపీడీవోలకు టార్గెట్‌లు నిర్దేశించారు. సోమవారం ఎంపీడీవోలు అన్ని మండల కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి గ్రామ కార్యదర్శులకు జన సమీకరణ కోసం మౌఖిక అదేశాలిచ్చారు. టీచర్లు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జన సమీకరణకు వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖకు అప్పగించారు. ఒక్కో మండలానికి 16 బస్సులు కేటాయించాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం రవాణా శాఖకు తాఖీదు ఇచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలల బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వీటిని ఎంపీడీవోలకు అప్పగించనున్నారు.
వారు ఆ బస్సులకు డీజిల్ కొట్టించి గ్రామాలకు రూట్ ప్రకారం పంపాలి. డీజిల్ ఖర్చులపై ఎలాంటి హామీ రాకపోవడంతో ఎంపీడీవోలు ఆందోళన చెందుతున్నారు. గతంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో జనాన్ని తరలించేందుకు వెచ్చించిన డబ్బులు సక్రమంగా రాలేదని ఎంపీడీఓలు చెబుతున్నారు. దీక్షకు హాజరయ్యే వీఐపీలు, బందోబస్తుకు కాన్వాయ్ కోసం కార్లు ఏర్పాటు చేసే బాధ్యత రవాణా శాఖపై పడింది. దీక్షలో ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. పోలీసు అధికారులు ట్రాఫిక్ మళ్లింపు తదితర సమస్యలపై దృష్టి సారించారు.
ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
నవనిర్మాణ దీక్షకు సంబంధించి ట్రాఫిక్ క్ర మబద్ధీరణపై పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నగర పోలీసు కమిషనర్ డీ గౌతమ్ సవాంగ్, ట్రాఫిక్ అధికారులు బెంజిసర్కిల్‌కు వెళ్లి ట్రాఫిక్ మళ్లింపుపై పరిశీలించారు.