- వెంటనే ప్రసారాలు పునరుద్ధరించాలని బీజేపీ విజ్ఞప్తి
- ఉద్యోగులు పురందేశ్వరిని కలిస్తే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపం?
- మిత్రపక్షమైన బీజేపీతో ఇలాగేనా వ్యవహరించడమంటూ మండిపాటు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపి వేయడంపై చంద్రబాబు ప్రభుత్వ తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏ పత్రికపైనైనా, టీవీ చానల్‌పై అయినా ప్రభుత్వం ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, అధికార ప్రతినిధి సుధీ ష్ రాంబొట్ల అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాలని బీజేపీ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. మీడియా స్వేచ్ఛకు బీజేపీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్న పలు టీవీ చానళ్లపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన కూడా తమ పార్టీ చేయలేదని చెప్పారు.
జేఏసీ సమక్షంలో ముద్రగడతో చర్చించాలి
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ చెప్పిందని, ఆ దిశగా ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వం జేఏసీ సమక్షంలో ఆయనతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఉద్యోగులు బీజేపీ నేతలను కలిస్తే తప్పా?
రాజధాని తరలింపు వ్యవహారంలో ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకోవడానికి బీజేపీ నేతలను కలిస్తే అదే పెద్ద తప్పుగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులపై ఆగ్ర హం వ్యక్తం చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బీజేపీ పట్ల టీడీపీ వ్యవహరిస్తున్న ధోరణి సరిగా లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, పార్టీ నేత సుదీష్ రాంబొట్లకు సమస్యలు విన్నవించిన ఉద్యోగులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఆక్షేపించారు.
సాక్షి టీవీపై ఆంక్షలు సరికాదు
Published Tue, Jun 14 2016 1:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement