పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లు ఎంపిక
ఎనిమిది డిజిట్లతో నంబర్ల కేటాయింపు
కమిషనర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి
విజయవాడ సెంట్రల్ : నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న డోర్ నంబర్ల క్రమబద్ధీకరణపై మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టి సారిం చారు. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో జిప్పర్ కోడ్ విధానంలో కొత్త డోర్ నంబర్లు కేటాయించి ఇంటికి ఒక యూనిక్ ఐడీ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పెలైట్ ప్రాజెక్ట్ కింద 13, 17, 18, 21 డివిజన్లను ఎంపికచేశారు. క్రమబద్ధీకరణ బాధ్యతను జిప్పర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేం దుకు వీలుగా సంస్థ ప్రతినిధులకు అథరైజేషన్‌తో పాటు ఐడీ కార్డులు మంజూరు చేశారు.
ఇక ఎనిమిది అంకెలే..
ఇప్పటివరకు ఒకే డోర్ నంబర్ వేర్వేరు గృహాలకు ఉండటంతో తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. ఈ విధానానికి చెక్ పెట్టాలన్నది కమిషనర్ ఆలోచన. నాలుగు ఆంగ్ల అక్షరాలు, నాలుగు న్యుమరికల్ నంబర్లు (ఎనిమిది డిజిట్లతో) యూనిక్ ఐడీని కేటాయించి జిప్పర్‌కోడ్‌కు అనుసంధానం చేస్తారు. ఇలా రూపొందించిన జిప్పర్ కోడ్‌ను మొబైల్ యాప్‌లో ఎంటర్ చేయగానే, ఆ ఇంటి చిరునామా మ్యాప్‌తో సహా కనిపిస్తుంది. గృహాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, ఇతర సంస్థల చిరునామాలను ఆన్‌లైన్‌లో చిటికెలో కనుక్కోవచ్చు.
ఈ సమాచారం ఇవ్వాలి
జిప్పర్ కోడ్ విధానంలో పూర్తి సమాచారం కావాలంటే గృహ యజమానులు తమ కరెంట్ మీటర్ సర్వీస్, నీటి కుళాయి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ల నంబర్లు, ఆస్తి, వాణిజ్య పన్నులు, రేషన్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల వివరాలను జిప్పర్ కన్సల్టెంట్ సిబ్బందికి అందించి సహకరించాల్సిందిగా కమిషనర్ కోరారు.
అంతా ఆన్‌లైనే..
నాలుగేళ్ల కిందట జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో డోర్ నంబర్ల కేటాయింపు ప్రక్రియను నాటి అధికారులు చేపట్టారు. క్యాడ్‌ఇన్ఫో సంస్థకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. మాన్యువల్ విధానంలో డోర్ నంబర్లను కేటాయించారు. నిధులలేమి కారణంగా మధ్యలోనే ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది.
స్మార్ట్‌సిటీ నేపథ్యంలో డోర్ నంబర్ల క్రమబద్ధీకరణతో పాటు గృహాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఆన్‌లైన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతగా ఎంపిక చేసిన నాలుగు డివిజన్లలో ఆశించిన ఫలితం సాధిస్తే నగరం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
ఇక కొత్త డోర్ నంబర్లు
Published Fri, Apr 3 2015 12:51 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement